ఒక మ్యాచ్ నిషేధం.. అందుకే తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడట్లేదు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి, ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది.
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ముంబై ఇండియన్స్ ఒకటి, ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. 2020లో చివరిసారిగా IPL టైటిల్ గెలుచుకున్న ముంబై ఫ్రాంచైజీకి గత సీజన్ పెద్దగా కలిసిరాలేదు. ఇక IPL 2024లో ముంబై ఇండియన్స్ జట్టు 14 మ్యాచ్‌లలో 10 ఓడిపోయి 10వ స్థానంలో నిలిచింది. ఫ్రాంచైజీ నాయకత్వంలో ఊహించని మార్పు చేసి, హార్దిక్ పాండ్యాను IPL 2024కి కెప్టెన్‌గా నియమించింది. హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేశారు ముంబై ఇండియన్స్ అభిమానులు. డ్రెస్సింగ్ రూమ్ రెండుగా చీలిపోయిందని, ప్రతికూల వాతావరణాన్ని సృష్టించిందని ఊహాగానాలు చెలరేగాయి. ఇవన్నీ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపించాయి.
IPL 2025 కి ముందు ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మలను నిలుపుకుంది. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ సాంట్నర్ వంటి నాణ్యమైన ఆటగాళ్లను కూడా వేలంలో తీసుకున్నారు. 2024 T20 ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజయపథంలో నడిపించిన తర్వాత హార్దిక్, రోహిత్ మధ్య విభేదాలు తొలగిపోయాయి.
ముంబై ఇండియన్స్ మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తొలి మ్యాచ్ ను ఆడనుంది. హార్దిక్ పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతడు CSKతో జరిగే మ్యాచ్ లో ఆడడం లేదు. కాబట్టి ముంబై మేనేజ్మెంట్ ప్రత్యామ్నాయ కెప్టెన్‌తో మ్యాచ్ లో దిగనుంది. LSGతో జరిగిన MI చివరి IPL 2024 మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా హార్దిక్‌ను ఒక మ్యాచ్ సస్పెండ్ చేశారు. MI స్లో ఓవర్ రేట్ తో మ్యాచ్ ఆడడం ఆ సీజన్ లో మూడవసారి, కాబట్టి కెప్టెన్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు.