శ్రీలంక‌పై విండీస్ మాస్ట‌ర్స్‌ థ్రిల్లింగ్ విజయం.. రేపు స‌చిన్‌ vs లారా ఫైన‌ల్‌ పైట్‌

వెస్టిండీస్ మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌పై ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది.

By Medi Samrat  Published on  15 March 2025 9:04 AM IST
శ్రీలంక‌పై విండీస్ మాస్ట‌ర్స్‌ థ్రిల్లింగ్ విజయం.. రేపు స‌చిన్‌ vs లారా ఫైన‌ల్‌ పైట్‌

వెస్టిండీస్ మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌పై ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది, దినేష్ రామ్‌డిన్ అర్ధ సెంచరీ, బ్రియాన్ లారా తుఫాను ఇన్నింగ్స్, టినో బెస్ట్ నాలుగు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న విండీస్ విజ‌యంలో కీల‌క‌మ‌య్యాయి. చివరి ఓవర్ చివరి బంతికి న‌మోదైన‌ ఈ విజయంతో బ్రియాన్ లారా జట్టు టైటిల్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా మాస్టర్స్‌తో తలపడనుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ మాస్టర్స్‌కు శుభారంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న డ్వేన్ స్మిత్ త్వ‌ర‌గానే ఔటయ్యాడు. విలియం పెర్కిన్స్ (24), లెండిల్ సిమన్స్ (17) కూడా పెద్ద బాగ‌స్వామ్యాలు న‌మోదు చేయ‌లేక‌పోయారు. 43 పరుగుల భాగస్వామ్యంతో పవర్‌ప్లేను ముగించారు. ఆ త‌ర్వాత‌ శ్రీలంక మాస్టర్స్ వరుసగా రెండు వికెట్లు తీశారు. దీంతో కరీబియన్ జట్టు 48/3తో కష్టాల్లో పడింది.

ఇక్కడి నుంచి కెప్టెన్ లారా బాధ్యతలు స్వీకరించాడు. 55 సంవత్సరాల వయస్సులో లారా చాడ్విక్ వాల్టన్‌తో కలిసి కీలకమైన 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దూకుడుగా ఆడుతున్న వాల్టన్ శ్రీలంక బౌలర్లకు గట్టిపోటీనిచ్చి 20 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అదే సమయంలో 33 బంతులు ఎదుర్కొన్న బ్రియాన్ లారా నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత రిటైర్డ్ అయ్యాడు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ రామ్‌దిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టుపై దాడి చేశాడు. 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్‌ల సహాయంతో 50 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక మాస్టర్స్ నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది. అసేల గుణరత్నే 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 66 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంది. గుణరత్నే మొదటి బంతికి సిక్సర్ కొట్టి ఆశలు రేపాడు. కానీ చివరి ఐదు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. గుణరత్నే కూడా ఔట్ అయ్యాడు.

Next Story