అరంగ్రేట మ్యాచ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వెస్టిండీస్ క్రికెట‌ర్‌

West Indies Debutant Jeremy Solozano Taken to Hospital.వెస్టిండీస్ జ‌ట్టు శ్రీలంకలో ప‌ర్య‌టిస్తోంది. రెండు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 9:58 AM GMT
అరంగ్రేట మ్యాచ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వెస్టిండీస్ క్రికెట‌ర్‌

వెస్టిండీస్ జ‌ట్టు శ్రీలంకలో ప‌ర్య‌టిస్తోంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలె వేదిక‌గా ఆదివారం వెస్టిండీస్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ త‌రుపున జెరెమీ సోలోజానో అరంగ్రేటం చేశాడు. అయితే అత‌డు ఫీల్డింగ్ చేస్తున్న క్ర‌మంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. మైదానంలోనే కుప్ప‌కూలిన అత‌డిని స్ట్రెచ‌ర్ సాయంతో గ్రౌండ్ బ‌య‌టికి తీసుకువెళ్లి అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఏం జ‌రిగిందంటే..?

లంక ఇన్నింగ్ 24వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోస్ట‌న్‌ చేజ్ బౌలింగ్ చేస్తుండ‌గా.. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ రీజియన్ వద్ద(బ్యాట్స్‌మెన్‌కు క్లోజ్‌లో) జెరెమీ సోలోజానో ఫీల్డింగ్ చేస్తున్నాడు. నాలుగో బంతిని రోస్ట‌న్ వేయ‌గా.. లంక ఓపెన‌ర్ క‌రుణ‌ర‌త్నె భారీ షాట్ ఆడాడు. ఈ క్ర‌మంలో బంతి షార్వ‌ర్డ్ షార్ట్ లెగ్‌లో ఉన్న జెరెమీ సోలోజానో హెల్మెట్‌ను తాకింది. బంతి ఎంత బ‌లంగా తాకింది అంటే.. దెబ్బ‌కు జెరెమీ సోలోజానో హెల్మెట్ విరిగిపోయింది. తీవ్ర‌మైన నొప్పితో విల‌విల లాడుతూ.. సోలోజానో మైదానంలోనే కుప్ప‌కూలాడు. వెంట‌నే స‌హాయ సిబ్బంది వ‌చ్చి అత‌డిని స్ట్రెచర్ సాయంతో మైదానంలోంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్లారు. అక్క‌డ ఉన్న అంబులెన్స్‌లో అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సోలోజానో స్థానంలో షెయ్ హోప్ ఫీల్డింగ్ కు వ‌చ్చాడు.

అరంగ్రేటం చేసిన జెరెమీ సోలోజానో పీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడ‌ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. వెంట‌నే అత‌డిని స్ట్రెచ‌ర్ సాయంతో మైదానం బ‌య‌టికి తీసుకెళ్లామ‌ని.. గాయం తీవ్ర‌త తెలుసుకునేందుకు అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి స్కానింగ్ తీయించిన‌ట్లు వెల్ల‌డించింది. అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు ట్వీట్ చేసింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 165 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ నిషాంక (56) ప‌రుగులు చేసి ఔట్ కాగా.. వ‌న్‌డౌన్ లో వ‌చ్చిన ఫెర్నాండో (3) విప‌లం అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్, కెప్టెన్ క‌రుణ ర‌త్నె (90 నాటౌట్‌) శ‌త‌కం దిశ‌గా సాగుతున్నాడు. అత‌డికి తోడుగా సీనియ‌ర్ ఆట‌గాడు అంజెలో మాథ్యూస్ (1) క్రీజులో ఉన్నాడు.

Next Story