ఒలింపిక్స్ లో భార‌త్ బోణి.. ర‌జ‌తం గెలిచిన మీరాభాయి

Weightlifter Mirabai Chanu Wins Silver.టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న ఒలింపిక్స్ లో భార‌త్ ప‌త‌కాల బోణి కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 6:47 AM GMT
ఒలింపిక్స్ లో భార‌త్ బోణి.. ర‌జ‌తం గెలిచిన మీరాభాయి

టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న ఒలింపిక్స్ లో భార‌త్ ప‌త‌కాల బోణి కొట్టింది. మ‌హిళ‌ల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను ర‌జ‌త ప‌త‌కం గెలిచి చ‌రిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి తొలి ప‌త‌కం అందించింది. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హౌ ఝిఝి 210 కేజీల‌తో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇండోనేషియాకు బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కింది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది.

'టోక్యో ఒలింపిక్స్ 2020లో భార‌త్ మొద‌టి ప‌త‌కాన్ని సాధించింది. 49కిలోల మ‌హిళ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించి భార‌త్‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచింది. అభినంద‌న‌లు మీరాబాయి చాను' అంటూ మాజీ క్రీడా మంత్రి కిర‌ణ్ రిరిజు ట్వీట్ చేశారు.

1996 త‌ర్వాత ఈ ఈవెంట్‌లో భార‌త్ గెలిచిన తొలి ప‌త‌కం ఇదే. క‌ర‌ణం మ‌ల్లీశ్వరి త‌రువాత బ‌రువులు ఎత్త‌డంలో భార‌త్‌కు ప‌త‌కం అందించింది మీర‌భాయి చాను నే. దాదాపు 24 ఏళ్ల త‌రువాత ఒలింపిక్స్ వెయిట్ లిప్టింగ్‌లో అద్బుతాన్ని ఆవిష్క‌రించింది. భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని అంత‌ర్జాతీయ వేదిక‌గా రెప‌రెప‌లాడించింది ఈ మ‌ణిపూర్ మ‌ణిపూస‌.

Next Story