అహో అచింత‌.. భార‌త్‌ ఖాతాలో మూడో స్వ‌ర్ణం

Weightlifter Achinta Sheuli bags India's third gold.బ్రిటన్‌లోని బ‌ర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 2:49 AM GMT
అహో అచింత‌.. భార‌త్‌ ఖాతాలో మూడో స్వ‌ర్ణం

బ్రిటన్‌లోని బ‌ర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భార‌త వెయిట్ లిఫ్ట‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. పురుషుల 73 కేజీల విభాగంలో అచింత షూలి స్వ‌ర్ణం గెలిచాడు. 20 ఏళ్ల ఈ బెంగాల్ లిఫ్ట‌ర్ ఆరంభం నుంచి స్థిరంగా బ‌రువులు ఎత్తి ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. స్నాచ్ తొలి ప్ర‌య‌త్నంలో 137 కేజీలు, రెండో ప్ర‌య‌త్నంలో 140 కేజీలు, మూడో ప్ర‌య‌త్నంలో 143 కేజీల బ‌రువు ఎత్తి రికార్డు సృష్టిస్తూ అగ్ర‌స్థానంలో నిలిచాడు.

ఆ త‌రువాత క్లీన్ అండ్ జ‌ర్క్‌లో తొలి ప్ర‌య‌త్నంలో 166 కేజీల‌ను తేలిగ్గా ఎత్తిన అచింత‌, రెండో ప్ర‌య‌త్నంలో 170 కేజీల‌ను ఎత్త‌డంతో విఫ‌లం అయ్యాడు. మూడో ప్ర‌య‌త్నంలో 170 కేజీల‌ను ఎత్తాడు. మొత్తంగా 313 కేజీల బ‌రువు ఎత్తి సరికొత్త కామన్‌వెల్త్‌ రికార్డు నెలకొల్పి ప‌సిడి ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. మ‌లేసియాకు చెందిన హిదాయ‌త్ (303 కేజీలు) ర‌త‌కం గెలవ‌గా కెనడాకు చెందిన షాద్‌(298 కేజీలు) కాంస్యం సాధించాడు.

కామ‌న్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. భార‌త ఖాతాలో ప్ర‌స్తుతం 6 ప‌త‌కాలు ఉన్నాయి. 49 కేజీల విభాగంలో మీరాబాయ్‌ చాను స్వర్ణం, 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్ రిన్నుంగ స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సార్గర్‌ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్‌ పూజారి కాంస్య పతకం సాధించారు.

Next Story