విరాట్ కోహ్లీని ఎగ‌తాళి చేస్తే.. జాఫ‌ర్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్

Wasim Jaffer`s EPIC reply to Australian broadcaster after it mocks Virat Kohli.టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 5:55 AM GMT
విరాట్ కోహ్లీని ఎగ‌తాళి చేస్తే.. జాఫ‌ర్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వ‌సీర్ జాఫ‌ర్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రైనా టీమ్ఇండియాపై కానీ, భార‌త ఆట‌గాళ్ల‌పై గానీ కామెంట్లు చేస్తే త‌నదైన శైలిలో కౌంట‌ర్ పంచ్‌లు ఇస్తుంటాడు. తాజాగా ఓ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని త‌క్కువ చేస్తూ కామెంట్ చేయ‌గా.. స‌ద‌రు వెబ్‌సైట్ కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు జాఫ‌ర్‌.

అస‌లేం జ‌రిగిందంటే.. గ‌త కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేని సంగ‌తి తెలిసిందే. చివ‌రి సారి కోహ్లీ 2019లో కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో శ‌త‌కం బాదాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రోసారి మూడెంక‌ల స్కోర్‌ను అందుకోలేదు. దీంతో అత‌డి బ్యాటింగ్ స‌గ‌టు కూడా ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో 7క్రికెట్ అనే ఓ ఆస్ట్రేలియా వెబ్‌సైట్ ' స్టాట్ ఆఫ్ ది డే' అని చెబుతూ.. 2019 నుంచి టెస్టుల్లో ఆస్ట్రేలియా బౌల‌ర్ మిచెల్ స్టార్క్ స‌గ‌టు 38.63, కోహ్లీ స‌గ‌టు 37.17 గా ఉంద‌ని వారి ఫోటోల‌తో స‌హా ఓ ట్వీట్ చేసింది. ఇది చూసిన జాఫ‌ర్ మండిపోయింది. వెంట‌నే త‌న‌దైన శైలిలో దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు.

టీమ్ఇండియా యువ పేస‌ర్ న‌వదీప్ సైనీ(53.30) వ‌న్డే కెరీర్ బ్యాటింగ్ స‌గ‌టు.. ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్‌స్మిత్‌(43.34) క‌న్నా ఎంతో మెరుగ్గా ఉందంటూ రీ ట్వీట్ చేశాడు. జాఫ‌ర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోఉంది. వెన్నునొప్పి కార‌ణంగా రెండో టెస్టుకు విరాట్ దూరం అయ్యాడు. ఈ టెస్టులో భార‌త్ ఓడిపోయింది. ఇక చివ‌రిదైన నిర్ణ‌యాత్మ‌క మూడో టెస్టులో విరాట్ ఆడే అవ‌కాశం ఉంద‌ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపాడు. కేప్‌టౌన్‌లో నెట్ సెష‌న్స్ ద్వారా కోహ్లీ తిరిగి ల‌య అందుకుంటాడ‌ని ద్ర‌విడ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

Next Story