శ్రీలంకను ఫైన‌ల్‌లో స్పిన్ తో కొట్టాలనే ప్లాన్.. స్టార్ స్పిన్న‌ర్‌కు టీమిండియా పిలుపు

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య సెప్టెంబరు 17న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  16 Sep 2023 1:30 PM GMT
శ్రీలంకను ఫైన‌ల్‌లో స్పిన్ తో కొట్టాలనే ప్లాన్.. స్టార్ స్పిన్న‌ర్‌కు టీమిండియా పిలుపు

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య సెప్టెంబరు 17న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది! బంగ్లాదేశ్ తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతడు ఫైనల్ కు అందుబాటులో ఉండే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో భారత్ ఓ స్పిన్నర్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. అక్షర్ స్థానంలో మరో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించారు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అక్షర్ బ్యాటింగ్ చేస్తుండగా చిటికెన వేలికి గాయమైంది. ఆ తర్వాత లంక ఫీల్డర్ విసిరిన బంతి గాయమైన వేలికే తగిలింది. అక్షర్ అలాగే బ్యాటింగ్ కొనసాగించినప్పటికీ, గాయం తీవ్రత దృష్ట్యా అతడు ఫైనల్లో ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. తొడ కండరాల గాయం కూడా అక్షర్ ను బాధిస్తుండడంతో, వాషింగ్టన్ సుందర్ ను జట్టులో చేర్చినట్టు బీసీసీఐ తెలిపింది.

ఫైనల్ ముందు శ్రీలంకకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ ఏడాది శ్రీలంక తరపున వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా తీక్షణ కొనసాగుతున్నాడు. అతడు జట్టుకు దూరమవ్వడం.. శ్రీలంక కు షాక్.

Next Story