కరోనా మహమ్మారిపై పోరుకు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..! తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇవ్వగా.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ 'కెట్టో' ద్వారా భారీగా విరాళాలను సేకరించాలని భావిస్తూ ఉన్నారు.
మొదట రూ. 7 కోట్ల విరాళాన్ని ఇతరుల నుంచి సేకరించాలని అనుకుని సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తికి అద్భుత స్పందన వచ్చింది. 7 కోట్ల రూపాయల విరాళాల టార్గెట్ ను చేరుకున్నారు. ఇప్పుడు రూ. 11 కోట్లకు చేరువగా వచ్చింది. ఎంపీఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ విరాళం రూ. 5 కోట్లు ఉండటం విశేషం. వసూలైన మొత్తాన్ని విరుష్క 'ఏసీటీ గ్రాంట్స్' అనే సంస్థకు అందిస్తారు.
బుధవారం నాటికే ఈ జంట అనుకున్న 7 కోట్ల మార్కును దాటేయడం విశేషం. ఇప్పుడు 11 కోట్ల రూపాయలకు చేరుకుంది. ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ను చేసింది ఈ జంట. ఈ కష్ట సమయాల్లో భారతదేశ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరచాలని.. అందుకే ఈ నిధులు కేటాయిస్తూ ఉన్నామని అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ జంట తెలిపింది.
గత వారమే ఈ జంట తాము చేయబోయే పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రతి ఒక్కరూ తోచినంత సహాయం చేయాలని పిలుపును ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో అవసరమైన వారికి అండగా ఉందామని కోరారు.