23 పరుగుల తేడాతో 'ఫెరారీ కారు' మిస్ చేసుకున్న సెహ్వాగ్ కొడుకు..!

భారత జట్టు మాజీ విధ్వంస‌క‌ర‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడు ఆర్యవీర్ 297 పరుగుల ఇన్నింగ్స్‌పై హర్షం వ్యక్తం చేశాడు.

By Medi Samrat  Published on  22 Nov 2024 2:42 PM GMT
23 పరుగుల తేడాతో ఫెరారీ కారు మిస్ చేసుకున్న సెహ్వాగ్ కొడుకు..!

భారత జట్టు మాజీ విధ్వంస‌క‌ర‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కుమారుడు ఆర్యవీర్ 297 పరుగుల ఇన్నింగ్స్‌పై హర్షం వ్యక్తం చేశాడు. అండర్-19 నాలుగు రోజుల జాతీయ టోర్నమెంట్ కూచ్ బెహార్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్యవీర్ సెహ్వాగ్ తన ఇన్నింగ్స్‌లో 51 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ ఇన్నింగ్సులో అతని స్ట్రైక్ రేట్ 90 కంటే ఎక్కువ.

గురువారం షిల్లాంగ్‌లోని ఎంసీఏ స్టేడియంలో ఢిల్లీ-మేఘాలయ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ 297 పరుగులు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ద్వారా, తన కొడుకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినందుకు అభినందించాడు.. అయితే అత‌డు ఫెరారీ కారు వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఆర్యవీర్‌కు.. 23 ప‌రుగుల తేడాతో పెరారీ మిస్ అయ్యావు అని రాశాడు. 2015లో సెహ్వాగ్ చేసిన‌ 319 పరుగుల రికార్డును బద్దలు కొట్టినట్లయితే, కొడుకుకు ఫెరారీ కారును బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేసిన‌ట్లుగా తెలుస్తుంది.

వీరేంద్ర సెహ్వాగ్ X హ్యాండిల్‌లో.. “ఆర్యవీర్ సెహ్వాగ్ బాగా ఆడాడు. 23 పరుగులతో ఫెరారీ చేజార్చుకున్నాడు. కానీ బాగా ఆడావు, నీవు ఇలానే జ్వలిస్తూ ఉండూ.. నీవు మరిన్ని డాడీ సెంచరీలు, డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించాలి అంటూ కొడుకు ఆర్యవీర్ ఫోటోను, ఇన్నింగ్స్ స్కోర్ కార్డ్ ఫోటోను వీరూ షేర్ చేశాడు. ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది

టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ నిలిచాడని గుర్తు చేశారు. 2004లో ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై వీరూ 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగేళ్ల తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తన టెస్టు రికార్డును తానే బ్రేక్ చేశాడు. 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్ 319 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ బ్యాట్స్‌మెన్.

Next Story