టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..తిరిగి టీ-20ల్లోకి విరాట్‌, రోహిత్!

2022 టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత రోహిత్ , విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

By Srikanth Gundamalla  Published on  5 Jan 2024 12:25 PM IST
virat, rohit, re-entry,  team india, t20,

టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..తిరిగి టీ-20ల్లోకి విరాట్‌, రోహిత్!

టీమిండియా అభిమానులకు ఇది శుభవార్త. భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ ఎంత మంచి బ్యాటర్లు అందరికీ తెలిసిందే. ఎన్నో రికార్డులు వీరి పేరిట ఉన్నాయి. అయితే.. కొన్నేళ్లుగా వీరిద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆడటం లేదు. తాజాగా స్వదేశంలో అప్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2022 టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. రోహిత్‌ లేకుండా ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యా, నంబర్ వన్‌ టీ20 బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌లు పలుమార్లు టీమ్‌కు సారథిగా ముందుండి నడిపంచారు. రోహిత, కోహ్లీ ఏడాదికి పైగా టీ20ల సెలక్షన్‌కు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. వీరికి వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించారు కూడా. ఈ క్రమంలోనే రోహిత్, కోహ్లీ లేకుండానే పాండ్యా కెప్టెన్సీలో యువ జట్టుతో టీమిండియా 2024 టీ20 వరల్డ్‌ కప్ ఆడుతుందని వార్తలు వచ్చాయి. అయితే.. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఇద్దరూ గాయాల కారణంగా టీమ్‌కు దూరంగా ఉన్నారు. దాంతో.. ఎవరిని కెప్టెన్‌గా ఉంచి ఆడిస్తారనే అంశం మేనేజ్‌మెంట్‌కు కష్టతరంగా మారింది.

అదీకాక వరల్డ్‌ కప్‌కు ముందు కేవలం అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్‌కు పాండ్యా, సూర్య అందుబాటులోకి రాకుంటే కెప్టెన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ టీ20 ఎంట్రీ గురించి రోహిత్, విరాట్ కోహ్లీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆయనకు ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు అప్ఘాన్‌ సిరీస్‌తో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని మాట ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సౌతాఫ్రికా టెస్టు రెండోరోజే ముగియడంతో విరాట్, రోహిత్‌కు విశ్రాంతి దొరికినట్లు అవుతోంది.

అప్ఘాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ శుక్రవారమే జట్టును ప్రకటిస్తుంది. రోహిత్, విరాట్ పేర్లు దాదాపుగా ఈ టీమ్‌లో ఖరారు అయిపోయాయి. పేసర్లు బుమ్రా, సిరాజ్‌లకు మాత్రం మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిట్‌నెస్ సమస్యలతో షమీ బాధపడుతున్నాడు. అతడు ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది స్పష్టత లేదు. జనవరి 11 నుంచి టీమిండియా, అప్ఘాన్ మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక జూన్‌ 4 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడులైన సంగతి తెలిసిందే.

Next Story