డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడాక కోహ్లీ పెట్టిన పోస్టు చూసారా?
Virat Kohli's Instagram story on scathing criticism after WTC Final failure. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఎదుర్కొంది.
By Medi Samrat Published on 12 Jun 2023 4:19 PM IST
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని ఎదుర్కొంది. 209 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ విజేతగా అవతరించింది. 444 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులకే కుప్పకూలింది. ఐదో రోజు 164-3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 70 పరుగులు మాత్రమే జోడించి 7 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 49, రహానే 46, కేఎస్ భరత్ 23 పరుగులు చేసి అవుటయ్యారు. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, స్టార్క్ 2, నాథన్ లైయన్ 4, కమిన్స్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆసీస్ క్రికెట్ జట్టు అరుదైన ఘనత అందుకుంది. ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్ల మేజర్ ఈవెంట్లలో విజేతగా నిలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అటు భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిపోవడం ఇది రెండోసారి. గతంలో న్యూజిలాండ్ చేతిలోనూ టీమిండియా టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఓడిపోయింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. ‘మౌనమే గొప్ప బలానికి మూలం’ అని ఓ కోట్ ను పోస్టు చేసాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమితో జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లపై విమర్శలు వస్తున్నాయి. విమర్శకులకు సమాధానంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లీ ఈ పోస్టు పెట్టాడని తెలుస్తోంది. ప్రస్తుతం, విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఐదో రోజు మ్యాచ్‌కు ముందుకూడా విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పోస్టు చేశారు. ‘‘మనలో ఆందోళనలు, భయాలు, సందేహాలు ఉంటే.. ప్రశాంతంగా జీవించడానికి, ప్రేమించడానికి చోటు ఉండదు. అందుకే అలాంటి వాటిని వదిలేసి ఉండటంపై సాధన చేయాలి’’ అని కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీలో రాశారు. 5 రోజు మ్యాచ్ మొదలవ్వడానికి ముందు కోహ్లీ నాటౌట్ గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ జట్టును గట్టెక్కిస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ ఎటువంటి సంచలన ఇన్నింగ్స్ కోహ్లీ ఆడలేదు.