అందుకే కోహ్లీ మ‌ళ్లీ ఆర్సీబీ 'కెప్టెన్సీ' చేప‌ట్ట‌లేదు..!

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది.

By Medi Samrat  Published on  15 Feb 2025 12:22 PM IST
అందుకే కోహ్లీ మ‌ళ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ చేప‌ట్ట‌లేదు..!

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్‌ను జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీ మరోసారి జట్టు బాధ్యతలు చేపడ‌తాడ‌ని ఊహాగానాలు వచ్చిన నేప‌థ్యంలో ఇది అభిమానులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది.

భారత మాజీ కెప్టెన్, చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆర్‌సిబి కెప్టెన్సీ కోహ్లీ ఎందుకు తీసుకోలేదో వివరించాడు. 2021లో ఈ జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ 2013 నుండి కెప్టెన్సీ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. జట్టును రెండుసార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు, కానీ టైటిల్ గెలవలేకపోయాడు.

కోహ్లీకి కెప్టెన్సీ అవ‌కాశం లభించినా.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతోనే అత‌డు కెప్టెన్సీని తీసుకోనని చెప్పాడని శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “విరాట్ కెప్టెన్సీకి నో చెప్పాడని నేను అనుకుంటున్నాను. నేను నా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి అని చెప్పాడు. ఇదంతా విరాట్ కోహ్లీ సమ్మతి (రజత్ పాటిదార్‌ని కెప్టెన్‌గా చేయడం) తర్వాతే జరిగిందని నేను అనుకుంటున్నాను. రజత్ పాటిదార్ జట్టుకు మంచి ఆప్షన్ అని శ్రీకాంత్ అన్నాడు. "రజత్ పాటిదార్ మంచి ఎంపిక, అతనికి మంచి ఐపిఎల్ అనుభవం ఉంది. అతనిఐ పెద్దగా అంచనాలు ఉండవు. 2007లో ధోనిని కెప్టెన్‌గా చేసినప్పుడు ఎవ‌రూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌పై కూడా పెద్దగా అంచనాలు ఉండవు. అతడు తన స్వంత నిర్ణయాలు తీసుకోగలడు. అవసరమైతే అతను విరాట్ కోహ్లీ నుండి సలహా తీసుకోవచ్చు అని అన్నాడు.

2021 సీజన్ తర్వాత కోహ్లీ RCB కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీని తర్వాత మెగా వేలంలో జట్టు దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్‌ను జట్టులోకి తీసుకుని, అతనిని కెప్టెన్‌గా కూడా చేసింది. అతని కెప్టెన్సీలో కూడా జట్టు టైటిల్ గెలవలేకపోయింది. కోహ్లి కెప్టెన్సీలో కూడా ఆ జట్టు టైటిల్ కరువును అంతం చేయలేకపోయింది. రజత్ పాటిదార్ సారథ్యంలో 17 ఏళ్ల కరువు తీరిపోతుందని RCB అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story