క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌న ప్ర‌యాణం నిలిచిపోతుంది : కోహ్లీ

Virat Kohli thanks to Shastri and support staff.టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన భారత జ‌ట్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Nov 2021 7:24 AM GMT
క్రికెట్ చ‌రిత్ర‌లో మ‌న ప్ర‌యాణం నిలిచిపోతుంది : కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ 2021లో టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన భారత జ‌ట్టు తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. క‌నీసం సెమీస్ చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది. పాకిస్థాన్‌, కివీస్ చేతిలో ఘోర ప‌రాజ‌యాల‌ను చ‌విచూసిన త‌రువాత తేరుకుని పసికూనలైన అఫ్గనిస్థాన్‌, స్కాట్లాండ్‌, నమీబియాపై భారీ విజయాలు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌పంచ క‌ప్ ఆరంభానికి ముందే తాను టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటాన‌ని కోహ్లీ చెప్పాడు. సోమ‌వారం న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి సారి టీ20 కెప్టెన్‌గా విధులు నిర్వ‌ర్తించాడు కోహ్లీ. దీంతో టీ20 కెప్టెన్‌గా విరాట్ శ‌కం ముగిసింది.

ఇక ప్ర‌ధాన కోచ్ గా ర‌విశాస్త్రి తో పాటు మ‌రికొంత మంది స‌హాయ సిబ్బంది ప‌ద‌వి కాలం కూడా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఇంత‌కాలం త‌న‌కు స‌హ‌క‌రించిన ఆట‌గాళ్లు, మాజీ కోచ్ ర‌విశాస్త్రి, స‌హాయ‌క సిబ్బందికి కోహ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా బుధ‌వారం ధ‌న్య‌వాదాలు తెలిపారు. 'మీరంతా నాకందించిన స‌హాయ, స‌హ‌కారం వెల‌క‌ట్ట‌లేనిది. జ‌ట్టుగా మ‌నం ఎన్నో మ‌రుపురాని విజ‌యాలు సాధించాం. మ‌న ప్ర‌యాణం భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో మిగిలిపోతుంది. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటున్నాను' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఓవరాల్‌గా కోహ్లి.. టి20ల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అత‌డి సార‌థ్యంలో భార‌త జ‌ట్టు 31 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా.. 16 మ్యాచుల్లో ఓడిపోయింది. 63.27 శాతంతో కెప్టెన్‌గా మెరుగైన రికార్డు కలిగి ఉన్న కోహ్లికి ఎందుకో ఐసీసీ ఫార్మాట్‌లో మాత్రం ఎప్పుడూ దురదృష్టమే ఎదురవుతూ వస్తోంది. ఇక ర‌విశాస్త్రి స్థానంలో ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి కివీస్‌తో ప్రాంర‌భం కానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా ద్రావిడ్‌, కెప్టెన్‌గా రోహిత్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

Next Story