'నా కుమార్తె ఫోటోలు తీయొద్దు'.. ఫోటో గ్రాఫ‌ర్ల‌కు కోహ్లీ విజ్ఞ‌ప్తి

Virat Kohli tells photographers Baby ka photo mat lena

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 7:06 AM GMT
నా కుమార్తె ఫోటోలు తీయొద్దు.. ఫోటో గ్రాఫ‌ర్ల‌కు కోహ్లీ విజ్ఞ‌ప్తి

టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ న‌టి అనుష్క దంప‌తులకు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఓ పాప జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఆ పాప‌కు వామికా అని నామ‌క‌ర‌ణం చేసిన ఈ జంట‌.. ఆ పాప‌ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. వామికా కు ఓ వ‌య‌స్సు వ‌చ్చేంత వ‌ర‌కు ఆమె ఫోటోల‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి చూపించ‌కూడ‌ద‌ని కోహ్లీ దంప‌తులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే వారు తెలియ‌జేశారు.ప‌లు సంద‌ర్భాల్లో త‌మ చిన్నారితో క‌లిసి దిగిన ఫోటోల‌ను కోహ్లీ దంప‌తులు సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్న‌ప్ప‌టికి అందులో వామిక ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు పడుతున్నారు. ఇక అభిమానులు మాత్రం తొలి పుట్టిన రోజు సంద‌ర్భంగానైనా వామిక రూపాన్ని చూడాల‌ని కోరుకుంటున్నారు.

టీమ్ఇండియా ఆట‌గాళ్లు గురువారం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెలుతుండ‌గా.. విమానాశ్ర‌యం వ‌ద్ద ఎదురుచూస్తున్న ఫోటోగ్రాప‌ర్ల‌ను చూసిన విరాట్ కోహ్లీ.. త‌న గారాల ప‌ట్టి వామికా ఫోటోలు తీయొద్ద‌ని ఫోటోగ్రాఫ‌ర్ల‌ను కోరాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే.. కోహ్లి హెచ్చరించే సమయానికే కొంద‌రు ఫొటోగ్రాఫర్లు వామిక ఫొటో క్లిక్‌మనిపించారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అందులో ఉన్నది వామికేనా అన్న విషయంపై మాత్రం ప్ర‌స్తుతానికి క్లారిటీ లేదు.

కాగా.. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాల నేపథ్యంలో కుటుంబాలతో కలిసి ద‌క్షిణాఫ్రికాకు వెళ్లేందుకు ఆట‌గాళ్లకు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అనుమతించలేదు. అయితే.. త‌న గారాల ప‌ట్టి తొలి పుట్టిన రోజు భార్యా పిల్ల‌ల‌తో క‌లిసి స‌మ‌యం గ‌డ‌పాల‌ని కోహ్లి బావించాడు. దీంతో బీసీసీఐని ప్ర‌త్యేకంగా అనుమ‌తిని కోరాడు. బీసీసీఐ ఇందుకు అనుమ‌తించ‌డంతో కుటుంబస‌భ్యుల‌ను ద‌క్షిణాఫ్రికాకు తీసుకువెళ్లాడు కోహ్లి.

Next Story