రోహిత్, కోహ్లీ సంచలన నిర్ణయం.. ఒకేసారి టీ20 క్రికెట్‌కు గుడ్‌బై
టీ20 వరల్డ్ 2024 విజేతగా భారత్ అవతరించింది.
By Srikanth Gundamalla Published on 30 Jun 2024 7:12 AM IST
రోహిత్, కోహ్లీ సంచలన నిర్ణయం.. ఒకేసారి టీ20 క్రికెట్‌కు గుడ్‌బై
టీ20 వరల్డ్ 2024 విజేతగా భారత్ అవతరించింది. బార్బోడస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా గట్టిగా పోరాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక గతంలొ 2007లో ఎంఎస్ ధోనీ సారధ్యంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో కప్ మరోసారి టీమిండియా సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ టోర్నీలో అంతగా రాణించని విరాట్.. చివరి మ్యాచ్‌లో మాత్రం జట్టుకు అవసరమైన స్కోర్‌ని అందించాడు. గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఈ మేరకు మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఈ రోజు మా కల నెరవేరింది. మేం సాదించాలని అనుకున్నది ఇదే. ఈ క్షణం కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఐసీసీ టోర్నమెంట్ గెలవడానికి 11 ఏళ్లుగా శ్రమిస్తున్నాం. ఇక భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 మ్యాచ్. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ గెలుపునకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అర్హుడు. రోఇత్ శర్మ 9 టీ20 వరల్డ్ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో వరల్డ్ కప్. అత్యున్నత స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది.' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేశాడు. టీ20 కెరీర్‌లో ఇప్పటి వరకు 124 మ్యాచ్ ఆడాడు. 48.38 సగటుతో 4112 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయానంతరం మాట్లాడిన రోహిత్.. 'ఈ ప్రపంచకప్ ఫైనల్ నా చివరి మ్యాచ్. నిజాయితీగా చెబుతున్నా ఈ ఫార్మాట్ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు. ఈ ఫార్మాట్‌తోనే టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైంది. నా టీ20 కెరీర్‌లో ప్రతీ మూమెంట్‌ను ఆస్వాదించాను. ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 2007 టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ.. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు.