ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డిన కోహ్లీ..?

Virat kohli injured during practice session.టెస్టు క్రికెట్‌కు పున‌రుజ్జీవం తీసుకువ‌చ్చేందుకు అంత‌ర్జాతీయ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 7:00 AM GMT
ప్రాక్టీస్ సెష‌న్‌లో గాయ‌ప‌డిన కోహ్లీ..?

టెస్టు క్రికెట్‌కు పున‌రుజ్జీవం తీసుకువ‌చ్చేందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌనిల్స్‌(ఐసీసీ) వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పాయింట్ల ప‌ట్టిక‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన భార‌త్‌, న్యూజిలాండ్ లు సౌతాంప్ట‌న్ వేదిక‌గా జూన్ 18 నుంచి 22 వ‌ర‌కు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు ఇంగ్లాండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ ను మొద‌లెట్టాయి. అయితే.. ఫైన‌ల్‌కు ముందు భార‌త అభిమానుల‌కు ఆందోళ‌న క‌లిగించే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

భార‌త కెప్టెన్‌, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ నెట్స్‌లో గాయ‌ప‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. గురువారం ష‌మీ బౌన్స‌ర్ ఆడే క్ర‌మంలో విరాట్ గాయ‌ప‌డిన‌ట్లు వినికిడి. గాయం కార‌ణంగా అత‌డు మూడు నుంచి ఆరు వారాలు ఆట‌కు దూరం కావాల్సి వ‌స్తుంద‌ని ఆజ్‌త‌క్ న్యూస్ ఛానెల్ చెబుతోంది. అయితే.. దీనిపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాగా.. . ష‌మి విసిరిన బంతి కోహ్లి ప‌క్క‌టెముక‌ల‌కు బ‌లంగా త‌గిలింద‌ని వ‌స్తున్న వార్త‌లు పుకార్లే అని ఇదే షోలో పాల్గొన్న విక్రాంత్ గుప్తా చెప్పారు.

ఒక‌వేళ విరాట్‌కు గ‌నుక గాయం అయితే.. టీమ్ఇండియాకు భారీ ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఇదిలా ఉంటే.. క‌ఠిన క్వారంటైన్‌ను ముగించుకున్న ఆట‌గాళ్లు అంతా రెండు రోజులుగా క‌లిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. కోహ్లీ, ర‌హానే, ష‌మితోపాటు బుమ్రా, గిల్ వంటి ప్లేయ‌ర్స్ నెట్స్‌లో చెమ‌టోడ్చారు. ఈ నెల 18న ఫైన‌ల్ ప్రారంభం కానుండ‌గా.. అక్క‌డి మేఘావృత‌మైన వాతావ‌ర‌ణానికి అల‌వాటు ప‌డ‌టానికి టీమ్‌కు వారం రోజుల స‌మ‌యం ఉంది. కోహ్లి గాయంపై వ‌స్తున్న వార్త‌ల‌పై బీసీసీఐ ఏదైనా ప్ర‌క‌ట‌న ఇస్తుందా లేదా చూడాలి.

Next Story
Share it