ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. దుమ్ములేపిన విరాట్ కోహ్లీ

Virat Kohli improves T20 rankings.తాజాగా విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 March 2021 11:11 AM GMT
Virat Kohli improves T20 rankings

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ఇంగ్లాండ్‌పై వ‌రుస‌గా రెండు అర్థ‌శ‌త‌కాలు సాధించిన విరాట్ ఒక స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని ఐదో స్థానంలో నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో 73,77తో అజేయంగా నిలిచి 47 రేటింగ్ పాయింట్లు సాధించి మొత్తంగా 744 పాయింట్ల‌తో టాప్‌-5లో కొన‌సాగుతున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలోనూ టాప్-5లో ఉన్న ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ.. టెస్ట్‌ల్లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన ఓపెన‌ర్ కేఎల్ రాహుల్(1,0,0) ఒక స్థానం కోల్పోయి 771 నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్​ అయ్యర్ 32 స్థానాలు మెరుగుపరుచుని 31వ ర్యాంకు అందుకున్నాడు. రిషభ్ పంత్​ 30 స్థానాలు మెరుగుపరుచుకుని 80వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లాండ్‌​ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్ 894 పాయింట్లతో​ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో టీ20లో 83 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన జోస్ బ‌ట్ల‌ర్ ఐదు స్థానాలు మెరుగు ప‌ర‌చుకుని 19 ర్యాంకు అందుకున్నాడు. జానీ బెయిర్​ స్టో రెండు స్థానాలు ఎగ‌బాకి 14, జాసన్ రాయ్​ 24వ స్థానంలో నిలిచారు.

బౌలింగ్ విభాగంలో యువ బౌలర్ శార్దూల్​ ఠాకూర్ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 27వ ర్యాంకు అందుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్​ 43 స్థానాలు ఎగబాకి 34వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Next Story
Share it