భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన కోహ్లీ, డివిలియర్స్.. అభిమానుల‌ను ఏడిపించేశారు

Virat Kohli cried after losing the match.ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి మ‌రోసారి నిరాశే ఎదురైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 5:51 AM GMT
భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన కోహ్లీ, డివిలియర్స్.. అభిమానుల‌ను ఏడిపించేశారు

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి మ‌రోసారి నిరాశే ఎదురైంది. కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. లోస్కోరింగ్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆశ‌ల‌పై సునీల్ న‌రైన్ ( 4 వికెట్లు, 26 ప‌రుగులు) నీళ్లు చ‌ల్లాడు. సోమ‌వారం రాత్రి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఓట‌మి పాలైంది. ఈ సీజన్‌ తర్వాత బెంగళూరు కెప్టెన్సీ పగ్గాలు వదలేయనున్నట్లు ముందే ప్రకటించిన కోహ్లీ ఉత్తచేతులతోనే వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ( 39; 33 బంతుల్లో 5 పోర్లు), టాప్ స్కోర‌ర్‌. 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. శుభ్‌మ‌న్ గిల్‌(29; 18 బంతుల్లో 4 పోర్లు), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(26 ; 30 బంతుల్లో 1 సిక్స్‌), సునీల్ న‌రైన్ (26 ; 15 బంతుల్లో 3 సిక్స‌ర్లు) లు రాణించారు.

వరుసగా రెండో ఏడాది ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇంటిబాట పట్టింది. దీంతో ఐపీఎల్‌ టైటిల్‌ లేకుండానే ఒక జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. 2013 నుంచి ఆర్‌సీబీకి కెప్టెన్‌గా కోహ్లీ వ్య‌వ‌హ‌రించారు. మొత్తం 140 మ్యాచ్‌ల‌కు సార‌థ్యం వ‌హించ‌గా.. 66 విజయాలు, 70 పరాజయాలు అందుకున్నాడు. మరో 4 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్‌సీబీ 2016లో పైన‌ల్‌కు చేరింది. మరో మూడుసార్లు ప్లేఆఫ్స్‌(2015, 2020, 2021 )చేరింది. హేమాహేమీలు ఆ జట్టుకు ఆడినా.. ఎవరూ ఆర్‌సీబీ కప్పు కలను మాత్రం నెరవేర్చలేదు.

ఇదిలా ఉంటే.. మ్యాచ్ ఓట‌మి అనంత‌రం విరాట్ ముఖంలో బాధ స్పష్టంగా క‌నిపించింది. మైదానంలోనే ఏడ్చేశాడు. తన కళ్లలోకి వచ్చిన నీళ్లను తుడుచుకుంటూ కనిపించిన కోహ్లీ.. తన బాధను క్యాప్‌తో కవర్ చేశాడు. అది చూసిన ఫాన్స్ మరింత బాధకు గురయ్యారు. మరోవైపు ఏబీ డివిలియర్స్ కూడా ఏడ్చేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story