ఇంగ్లండ్‌తో ఆదివారం రాత్రి మొతేరాలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (73 నాటౌట్; 49 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఫుల్ షాట్, ప్లిక్ షాట్, కవర్ డ్రైవ్, ప్లాట్ సిక్స్‌లతో విరాట్ అదరగొట్టేశాడు. షాట్ ఏది ఆడినా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు.. పురుషుల అంతర్జాతీయ టీ20 పోటీల్లో 3 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డు స్థాపించాడు. కోహ్లీ 87 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 3001 పరుగులతో నెం.1గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందే ఇద్దరు మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మార్కును అందుకున్నారు. న్యూజిలాండ్ కు చెంది సుజీ బేట్స్ (3,301), వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ (3,062) ఈ ఘనత సాధించారు.
మేము అనుకున్న విధంగా ఆడాం.. మా బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో కేవలం 34 పరుగులు మాత్రమే ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమని చెప్పాడు కోహ్లీ. ఎందుకంటే.. ఇంగ్లండ్‌లో హిట్టర్స్ ఎక్కువగా ఉన్నారు. సుందర్ బాగా బౌలింగ్ చేశాడు. భువీ, ఠాకూర్, చహల్ అద్భుత బంతులు వేశారు. మొత్తానికి బౌలింగ్ మరియు బ్యాటింగ్‌తో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది జట్టు విజయమని చెప్పుకొచ్చాడు కోహ్లీ. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అరంగేట్రంలో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనకు ఇష్టమొచ్చినట్లు బ్యాటింగ్ చేశాడు. భయం లేకుండా కచ్చితమైన షాట్లతో అలరించాడన్నాడు కోహ్లీ. ఆటలో నేను మళ్లీ ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాల్సి వచ్చిందని.. మరోవైపు అనేక ఇతర ఆలోచనలతో సతమతమవుతున్నానని అన్నాడు కోహ్లీ. నా బ్యాటింగ్ గురించి జట్టు యాజమాన్యం, నా సతీమణి అనుష్క శర్మ చాలా విషయాలు మాట్లాడారు. నేనేం చేయాలో చెప్పారని తెలిపారు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఏబీ డివిలియర్స్‌తో స్పెషల్ చాట్ చేశాను. బంతిని మాత్రమే చూసి ఆడమని చెప్పాడు. నేను అదే చేశానని అన్నాడు.