సాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే జంట ఏదంటే భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ అని చెబుతూ ఉంటారు. ఇప్పటికే పలు సహాయ కార్యక్రమాల్లో ఈ జంట పాల్గొంది. ఇప్పుడు కరోనా కష్ట సమయాల్లో కూడా ఈ జంట ముందుకొచ్చింది. ఏకంగా 2 కోట్ల రూపాయలను సాయం చేశారు. అంతేకాకుండా సాయం చేయాలనే మంచి మనసు ఉన్న వాళ్లు కూడా ముందుకు రావాలని.. అందుకు సంబంధించి ఓ వీడియోను వారి వారి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఐపీఎల్ అయిపోగానే విరాట్ కోహ్లీ కరోనా బాధితులను ఆదుకోవాలనే విషయమై చర్చలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే..! ఐపీఎల్ వాయిదా పడటంతో వెంటనే కొవిడ్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాడు కోహ్లీ. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లిన కోహ్లీ కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా తమతో సంప్రదింపులు జరిపినట్లు యువసేన సభ్యుడు రాహుల్ కనాల్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కోహ్లీ తమతో కలిసి పని చేస్తున్నాడని చెబుతూ ఫొటోలను షేర్ చేశాడు. అనుష్క శర్మ కూడా తన పుట్టినరోజప్పుడు కోవిడ్ బాధితులకు సహాయం చేస్తానని చెప్పారు.
ఇక ఈరోజు ఈ జంట కలిసి ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సహాయపడటం కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని తమ ఫ్యాన్స్‌ను కోరారు. సహాయ కార్యక్రమాల కోసం నిధిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధి కోసం తాము రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కెట్టో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎంతో కొంత సాయం చేయాలని కోరారు. తమ ఉద్యమంలో అందరూ చేరాలని కోరారు. కెట్టోకు విరాళాలు పంపాలని, దాని ద్వారా కరోనా రోగులకు సాయం చేయొచ్చని విజ్ఞప్తి చేశారు.