క్వారంటైన్ రూమ్ లో కోహ్లీ.. సిరీస్ కు సన్నాహకాలు
Virat Kohli Enter Bio-bubble At Mumbai Hotel.ఇంగ్లాండ్ కు వచ్చే నెలలో భారతజట్టు వెళ్లాల్సి ఉండడంతో ఆటగాళ్లందరూ క్వారంటైన్ లో ఉంటున్నారు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ముంబైలో ఉన్న మిగిలిన ఆటగాళ్లు బయో బబుల్ లోకి చేరుకున్నారు. ఇంగ్లాండ్ కు వచ్చే నెలలో భారతజట్టు వెళ్లాల్సి ఉండడంతో ఆటగాళ్లందరూ క్వారంటైన్ లో ఉంటున్నారు. మిగిలిన ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లు మే 19 నుండే బయో బబుల్ లోకి చేరుకున్నారు. ముంబైలో ఉంటున్న ఆటగాళ్ల కంటే వారం రోజుల ముందే ఈ ఆటగాళ్లు హోటల్ లోకి ఎంటర్ అయ్యారు. వారం రోజుల పాటూ గదుల్లోనే ఉండాలని.. ఆ తర్వాతే మిగిలిన వారితో కలవాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. కోహ్లీతో పాటూ బయో బబుల్ లోకి ఎంటర్ అయిన మిగిలిన ఆటగాళ్లందరికీ అన్ని సదుపాయాలను అందించామని తెలిపారు. ఐసోలేషన్ లో ఉన్నా కూడా ఆటగాళ్లు వర్క్ ఔట్స్ చేసుకోడానికి వీలు కల్పించామని అన్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామని అన్నారు. ముంబై నుండి చార్టర్డ్ ఫ్లైట్ లో ఇంగ్లండ్ కు భారతజట్టును తీసుకుని వెళ్తామని బీసీసీఐ అధికారి వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్లకు కరోనా వ్యాక్సిన్ కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే..! భారత ఆటగాళ్లకు రెండో డోస్ యూకేలో అందిస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు. యూకే లోని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో ఇప్పటికే మాట్లాడామని.. అక్కడే ఆటగాళ్లకు రెండో డోస్ అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ కు పయనమవ్వనున్నారు. అక్కడ కూడా 10 రోజులు క్వారంటైన్ లో ఆటగాళ్లు ఉండనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా భారత జట్టు జూన్ 18న న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ తో అయిదు టెస్ట్ మ్యాచుల్లో భారత్ తలపడనుంది.