వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్

ఒలింపిక్స్‌లో సంచలనంగా మారిన భారత రెజ్లర్‌ వినేష ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 6:46 AM IST
vinesh phogat, sensational decision, wrestling, retirement ,

వినేష్ ఫోగట్ షాకింగ్ నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్

ఒలింపిక్స్‌లో సంచలనంగా మారిన భారత రెజ్లర్‌ వినేష ఫోగట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా వినేష్ ఫోగట్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. ఎక్స్‌లో పోస్టు పెట్టిన వినేష్ ఫోగట్.. కుస్తీ తనపై గెలిచిందని పేర్కొంది. తాను ఓడిపోయాననీ.. క్షమించండి అంటూ రాసుకొచ్చింది. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైంది అంటూ భారతీయులను ఉద్దేశించి పోస్టు పెట్టింది. అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.. తనకు ఇంకా పోరాడే బలం లేదంటూ ఎక్స్‌ వేదికగా ఎమోషనల్ అయ్యింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. ఆమె ఫైనల్‌ వరకు వెళ్లి డిస్‌క్వాలిఫై కావడం పట్ల యావత్‌ దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఒలింపిక్స్‌ నుంచి అనర్హురాలిగా వినేష్ ఫోగట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఫోగట్ కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఆ ఆర్భిట్రేషన్‌ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇంతలోనే వినేశ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

29 ఏళ్ల వినేష్ ఫోగట్ ఒలింపిక్ క్రీడల ఫైనల్స్‌కు చేరుకుని, మహిళల 50 కేజీల విభాగంలో కనీసం రజత పతకాన్ని సాధించే విషయంలో తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నిలిచింది. అయితే, ఆమె తన బౌట్ ఉదయం తప్పనిసరి బరువులో అధిక బరువు ఉన్నట్లు గుర్తించబడింది. ఆమె కోచ్‌లు, సహాయక సిబ్బంది, భారత ఒలింపిక్ సంఘం ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఈవెంట్ నుండి అనర్హులుగా ప్రకటించబడింది.

ఆకలితో ఉండటం, ద్రవాలకు దూరంగా ఉండటం మరియు చెమట పట్టేందుకు రాత్రంతా మేల్కొని ఉండడం వంటి కోతలను ఆమె నిర్విరామంగా చేయడం వల్ల తీవ్రమైన నిర్జలీకరణం కారణంగా ఆమెను గేమ్స్ గ్రామంలోని పాలీక్లినిక్‌కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అధిక బరువును తగ్గించుకోవడానికి ఆమె తన జుట్టును చిన్నదిగా కత్తిరించడానికి కూడా ప్రయత్నించింది. కానీ ఏదీ పని చేయలేదు.

Next Story