ఐపీఎల్ లో యార్కర్లతో అద్భుతంగా రాణించిన నటరాజన్ ఆసీస్ టూర్ లో టీ20, వన్డే, టెస్ట్ జట్లలో చోటు దక్కించుకున్నాడు. సుదీర్ఘ సిరీస్ ను పూర్తీ చేసిన నటరాజన్ సొంత ఊర్లో అడుగుపెట్టాడు. అతడికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా నుంచి బెంగళూరు వచ్చిన నటరాజన్ అక్కడి నుంచి తన సొంతూరు చేరుకున్నాడు. నటరాజన్ స్వస్థలం తమిళనాడులోని సేలం జిల్లా చిన్నప్పంపట్టి గ్రామం. తమ ఊరివాడు భారత జట్టుకు ఎంపిక కావడమే కాకుండా, రాణించడంతో చిన్నప్పంపట్టి గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
టపాసులతో పెద్ద పండగ వాతావరణం అక్కడ మొదలైంది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన నటరాజన్ ను గుర్రాల రథంలో ఊరేగించారు. నటరాజన్ నివాసం వరకు ఈ ఊరేగింపు సాగింది. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలిరావడంతో చిన్నప్పంపట్టిలో కోలాహల వాతావరణం నెలకొంది.
నటరాజన్ ను ఊరేగించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై భారత డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించారు. ''ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ'' అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సెహ్వాగ్.