3డీ ప్లేయర్ అంటూ చేస్తున్న ట్రోల్స్ పై స్పందించిన విజయ్ శంకర్
Vijay Shankar gives reply on Ambati Rayudu's '3D' tweet. తాజాగా విజయ్ శంకర్ 'త్రీడీ గ్లాసెస్' వివాదంపై స్పందించాడు.
By Medi Samrat Published on 17 May 2021 9:21 AM ISTవిజయ్ శంకర్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతున్న సంగతి తెలిసిందే..! విజయ్ శంకర్ విఫలమైతే చాలు 3డీ ప్లేయర్ అంటూ భారీగా ట్రోల్స్ మొదలవుతాయి. ఇంతకూ ఈ 3డీ ప్లేయర్ అనే నిక్ నేమ్ ఎందుకు వచ్చిందో తెలుసా..?
2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడును భారత క్రికెట్ జట్టులోకి తీసుకుంటారని భావించగా.. ఊహించని విధంగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచకప్‌కి అంబటి రాయుడ్ని పక్కన పెట్టిన భారత సెలెక్టర్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశామని అన్నారు. రాయుడికి బదులుగా శంకర్‌ని ఎంపికచేయడంపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ రాయుడితో పోలిస్తే విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రూపంలో టీమ్‌కి మూడు కోణాల్లో ఉపయోగపడతాడని అన్నాడు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా అంబటి రాయుడు ''వరల్డ్‌కప్‌ని చూసేందుకు ఇప్పుడే కొత్త త్రీడీ గ్లాస్‌లను ఆర్డర్ చేశాను'' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సంచలనమైన సంగతి తెలిసిందే.
తాజాగా విజయ్ శంకర్ 'త్రీడీ గ్లాసెస్' వివాదంపై స్పందించాడు. ఆ త్రీడీతో నాకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అభిమానులు ప్రతిసారి ఆ త్రీడీని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నన్ను ఆటపట్టిస్తున్నారని అన్నాడు విజయ్ శంకర్. రాయుడు ఆ ట్వీట్ చేసిన తర్వాత ప్రపంచకప్‌లో నేను మూడు మ్యాచ్‌లాడి.. మెరుగైన ప్రదర్శన కనబర్చానని సమర్థించుకున్నాడు. నేనేమీ తప్పులు చేయలేదని శంకర్ చెప్పాడు. ఐపీఎల్‌లో కూడా నా బ్యాటింగ్ ఆర్డర్ వేరు. చాలా మంది అంబటి రాయుడితో నన్ను పోలుస్తున్నారని విజయ్ శంకర్ చెప్పాడు. ఇద్దరం ఆడుతున్న పరిస్థితులు, బ్యాటింగ్ ఆర్డర్‌లు వేరని.. ఇవన్నీ పట్టించుకోకుండా కొందరు నన్ను ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ శంకర్ తెలిపారు.
'త్రీడీ గ్లాస్' ట్వీట్ అంబటి రాయుడు అంతర్జాతీయ కెరీర్ ను కూడా దెబ్బ తీసిందని క్రికెట్ పండితులు చెబుతూ ఉంటారు. ఆ ట్వీట్ తర్వాత అంబటి రాయుడు భారత జట్టులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2019 ప్రపంచ కప్ తర్వాత ఊహించని రీతిలో అంబటి రాయుడు రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న అంబటి రాయుడు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సన్ రైజర్స్ తరపున ఆడుతున్న విజయ్ శంకర్.. బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ ఉన్నాడు.