అభిమానం అంటే అంతే మరీ.. సెంచరీ చేసి తలైవాకు అంకితం.. రజనీ స్టైల్‌లో సంబరాలు

Venkatesh Iyer dedicates century to Rajinikanth on his birthday.యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 5:03 PM IST
అభిమానం అంటే అంతే మరీ.. సెంచరీ చేసి తలైవాకు అంకితం.. రజనీ స్టైల్‌లో సంబరాలు

యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 సీజ‌న్ రెండో అంచెపోటీల్లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున బ‌రిలోకి దిగి స‌త్తా చాట‌డంతో స్వ‌ల్ప‌కాలంలోనే వెంక‌టేష్ అయ్య‌ర్ టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. కివీస్‌తో ఇటీవ‌ల ముగిసిన టీ20 సిరీస్‌తో భార‌త జ‌ట్టులోకి అరంగ్రేటం చేసిన 26 ఏళ్ల వెంక‌టేష్ అయ్య‌ర్‌.. విజ‌య్ హాజారే ట్రోఫీలో చెల‌రేగిపోతున్నాడు. మధ్యప్రదేశ్ జట్టు తరుపున బ‌రిలోకి దిగిన వెంక‌టేష్.. నాలుగు మ్యాచుల్లో రెండు సెంచ‌రీల‌తో దుమ్ము రేపాడు.

ఆదివారం చంఢీగ‌ర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ వ‌చ్చిన వెంక‌టేష్ అయ్య‌ర్‌.. కేవ‌లం 113 బంతుల్లో 8 పోర్లు, 10 సిక్స‌ర్ల సాయంతో 151 ప‌రుగులు చేశాడు. వెంట‌క‌టేష్ దాటికి మ‌ధ్య‌ప్ర‌దేశ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 331 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ తర్వాత వెంకటేశ్ సెల‌బ్రెష‌న్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ స్టైల్ లో వెంకటేష్‌ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తలైవా స్టైలులో కళ్లజోడు పెట్టుకుంటున్నట్లు పోజులిచ్చాడు. ఈ వీడియోను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఫ్రాంచైజీ ట్విట‌ర్‌లో షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది. కాగా.. నేడు (డిసెంబ‌ర్ 12) ర‌జినీకాంత్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన ఛాతీ మీద రజినీకాంత్ టాటూను వేయించుకోగా.. తాజాగా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ తన అభిమాన నటుడికి తనదైన శైలిలో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడంతో తలైవా అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story