క్రికెటర్ల కుటుంబాలను కబళించి వేస్తున్న కరోనా.. పీయూష్‌ చావ్లా తండ్రి కన్నుమూత..!

Cricketers who lost their family members due to Covid. కరోనా మహమ్మారి ఎంతో మంది

By Medi Samrat
Published on : 10 May 2021 5:34 PM IST

cricketers

కరోనా మహమ్మారి ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంది. పలువురు క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక కొందరి క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా కరోనాతో మరణిస్తూ ఉన్నారు. టీమిండియా వెటరన్‌ బౌలర్‌ పీయూష్‌ చావ్లా తండ్రి ప్రమోద్‌ కుమార్‌ చావ్లా కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన, సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పీయూష్‌ చావ్లా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. పియూష్‌ చావ్లా తండ్రి మృతి పట్ల చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా సంతాపం ప్రకటించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. ముంబై ఇండియన్స్ జట్టు కూడా పీయూష్ చావ్లాకు ధైర్యం చెప్పింది. తాము అండగా ఉన్నామని వెల్లడించింది.

భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి, సోదరి కరోనాతో కన్ను మూశారు. అది కూడా కేవలం రెండు వారాల వ్యవధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. వేదా కృష్ణ మూర్తి సోదరి వత్సలా శివ కుమార్ చిక్ మగళూరులో కరోనాతో కన్నుమూసింది. వేదా కృష్ణమూర్తి అక్క వత్సల వయసు 42 సంవత్సరాలు.

రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు చేతన్ సకారియా తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ సకారియా కరోనా కారణంగా కన్నుమూశాడు. గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ లో చేతన్ సకారియా తండ్రి కాంజీభాయ్ కరోనాకు చికిత్స తీసుకుంటూ మరణించాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. చేతన్ సకారియాతో తాము టచ్ లోనే ఉన్నామని.. అతడి కుటుంబానికి అండగా నిలుస్తామని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలిపింది.

భారత జట్టు మాజీ క్రికెటర్ విజయ్ చేతన్ చౌహాన్ కరోనా కారణంగా కన్ను మూశారు. ఆగస్టు 16, 2020న చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అంరోహా నుండి ఎంపీగా రెండు సార్లు గెలిచారు కూడానూ..! కరోనా పాజిటివ్ రాగానే ఆయన్ను గురుగ్రామ్ లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో.. వైద్యులు ఆయన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, మాజీ జట్టు సభ్యుడు విజయ్ షిర్కే కన్ను మూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. సచిన్ మరో స్నేహితుడు అవి కదమ్ కరోనాతో కన్నుమూశారు.

ఇక ఐపీఎల్ ఆడిన చాలా మంది ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. బయో బబుల్ లో ఐపీఎల్ నిర్వహించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ కూడా రద్దు అయ్యింది.


Next Story