తొలి బంతికే సిక్స్ కొట్టేంత ధైర్యం.. అవుటయ్యాక ఎందుకా కన్నీళ్లు..?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ..
By Medi Samrat
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. వైభవ్ తన తొలి ఐపీఎల్ బంతికే సిక్సర్ బాదాడు. తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానుల మనసు గెలుచుకున్నాడు వైభవ్. అయితే అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ఏడుస్తూ కనిపించాడు.
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 8.4 ఓవర్లలో 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వైభవ్ సూర్యవంశీ మంచి షాట్లు ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బౌలింగ్ మార్చి మార్క్రామ్‌కు బంతిని అందించాడు.
మార్క్రామ్ లెగ్ సైడ్ డౌన్ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేయగా.. వైభవ్ క్రీజు బయటకు వచ్చి ఆడబోయాడు.. పంత్ వికెట్ వెనుక ఎటువంటి పొరపాటు చేయకుండా స్టంపౌట్ చేశాడు. దీంతో 20 బంతుల్లో 34 పరుగులతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో వైభవ్ రెండు ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఔటయ్యాక పెవిలియన్‌కు తిరిగివెళ్తూ ఏడ్చాడు. అతని ముఖ కవళికలను బట్టి అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడాలనుకుంటున్నట్లు కనిపించింది. వైభవ్ తన అరంగేట్రం చిరస్మరణీయంగా ఉండాలని కోరుకున్నాడు. అది కుదరలేదనే బాధ కనిపిచింది. అయితే ఈ ఇన్నింగ్స్ కారణంగా వైభవ్ క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.