'వైభవ్ సూర్యవంశీ అంటే వారికి పిచ్చి'.. అతడిని కలవడానికి ఇద్దరమ్మాయిలు ఏం చేశారంటే..?
కేవలం 14 ఏళ్ల వయసులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన మ్యాజిక్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాడు.
By Medi Samrat
కేవలం 14 ఏళ్ల వయసులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన మ్యాజిక్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నాడు. ప్రస్తుతం, అతడు భారత అండర్-19 జట్టులో సభ్యుడిగా యూత్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. అతడి అభిమానుల ఫాలోయింగ్ కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో అతని గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ బ్యాట్స్‌మన్ IPL 2025 తన మొదటి సీజన్‌లో వేగవంతమైన సెంచరీ సాధించడం ద్వారా ముఖ్యాంశాల్లో నిలిచాడు. అయితే ఇప్పుడు అతడు భారతదేశంలోనే కాకుండా గ్లోబల్ స్టార్ అయ్యాడు. అతడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. ఇద్దరు యువతులు.. అతడిని కలవడానికి కారులో ఆరు గంటలు ప్రయాణించడమే దీనికి నిదర్శనం. ఐపీఎల్‌లో వైభవ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఇందుకు సంబంధించిన చిత్రాన్ని షేర్ చేసింది.
రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ ప్రకారం.. అన్య, రివా అనే ఈ ఇద్దరు అమ్మాయిలు వోర్సెస్టర్‌లో ఉన్న వైభవ్‌ను చూసేందుకు, కలవడానికి, అతనితో ఫోటో దిగడం కోసం ఆరు గంటలు ప్రయాణించారు. ఆ ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించారు. రాజస్థాన్ రాయల్స్ చిత్రాన్ని షేర్ చేస్తూ, 'మా అభిమానులే అత్యుత్తమం అనడానికి ఇది నిదర్శనం' అని రాసింది. ఆ రోజు ఆడపిల్లలిద్దరికీ చిరస్మరణీయమని రాసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఇదిలావుంటే.. భారత అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టును ఓడించి ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. పరుగులు చేయడం నుండి వికెట్లు తీయడం వరకు, యూత్ వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు ఆధిపత్యం చెలాయించారు. వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు చేయగా, కనిష్క్ చౌహాన్ అత్యధిక వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వైభవ్ చాలా తుఫాను ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 71.00 సగటు, 174.02 స్ట్రైక్ రేట్‌తో 355 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.