'పుట్టినరోజు నాడు కేక్ కూడా కట్ చేయలేదు'.. సీఎస్కేపై విజయం త‌ర్వాత‌ అసలు కారణం చెప్పిన సూర్యవంశీ..!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

By -  Medi Samrat
Published on : 31 March 2026 11:50 AM IST

పుట్టినరోజు నాడు కేక్ కూడా కట్ చేయలేదు.. సీఎస్కేపై విజయం త‌ర్వాత‌ అసలు కారణం చెప్పిన సూర్యవంశీ..!

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్‌లో మార్చి 27న వచ్చిన తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారని వైభవ్‌ను అడగ్గా.. తాను పుట్టినరోజు కేక్ కూడా కట్ చేయలేదని అతను బదులిచ్చాడు.

సీఎస్కేను ఓడించిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. నేను నా పుట్టినరోజును ప్రత్యేకంగా ఏమీ జ‌రుపుకోలేదు. కేక్ కట్ చేద్దామని అనుకున్నాను, కానీ అందరూ ముఖానికి కేక్ పూస్తారు.. కాబట్టి త్వరగా పడుకున్నానని పేర్కొన్నాడు. అతని ఈ సమాధానానికి వ్యాఖ్యాతలు నవ్వారు. తన సహజమైన ఆటను కొనసాగించడానికి జట్టు యాజమాన్యం, సీనియర్ ఆటగాళ్లు తనకు స్వేచ్ఛనిచ్చారని తెలిపాడు. బౌలర్లు నాపై దాడి చేస్తారని కోచ్ ప్రత్యేకంగా చెప్పలేదు. ఆయన తప్ప ప్రపంచమంతా అదే అంటున్నారు. కోచ్ నాకు ధైర్యం చెప్పి, నా సహజమైన ఆట ఆడమని, ఆటకు, పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ చేయమని చెప్పారని పేర్కొన్నాడు.

వైభవ్ తన పుట్టినరోజు జరుపుకోకపోయినా, మూడు రోజుల తర్వాత మైదానంలో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది, CSKపై తన జట్టుకు 8 వికెట్ల విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, CSKను 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత వారు కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు.

Next Story