కోహ్లీ డ‌కౌట్‌.. ఉత్త‌రాఖండ్ పోలీసుల వినూత్న ట్వీట్‌

Uttarakhand police tweets on Kohli’s dismissal to raise driving awareness.ఉత్త‌రాఖండ్ పోలీసు విభాగం రోడ్డు ప్ర‌మాదాల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 12:46 PM IST
కోహ్లీ డ‌కౌట్‌.. ఉత్త‌రాఖండ్ పోలీసుల వినూత్న ట్వీట్‌

ఉత్త‌రాఖండ్ పోలీసు విభాగం రోడ్డు ప్ర‌మాదాల‌పై వినూత్నంగా ట్వీట్ చేసింది. శుక్ర‌వారం రాత్రి ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో కోహ్లీ డ‌కౌట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లోనే భారీ షాట్‌కు య‌త్నించిన కోహ్లీ ఔటైయ్యాడు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో క్రిస్ జోర్డాన్ కు క్యాచ్ ఇచ్చి ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఔట్‌‌ను ప్రస్తావిస్తూ ఉత్తరాఖండ్ పోలీసు విభాగం రోడ్ల‌పై ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి ఓ వినూత్న సందేశం చేర‌వేసింది.

`హెల్మెట్ ఒక్కటే సరిపోదు.. చాలా ఏకాగ్రతగా డ్రైవింగ్ చేయాలి. లేకపోతే కోహ్లీలా మీరు మీ జీవితంలో డకౌట్ అవుతార`ని ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది కోహ్లీని అవ‌మానించేలా ఉంద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేయ‌డం స‌రికాదంటున్నారు. దీనిపై ఉత్తరాఖండ్ పోలీసులు స్పందించారు. కోహ్లిని కించపరచడం మా ఉద్దేశం కాదని.. కేవలం రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఇలా చేశామ‌న్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవ‌ర్లో 7 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేయ‌గా.. ఇంగ్లాండ్ జ‌ట్టు 15.3 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ల‌క్ష్యాన్ని చేదించింది. ఇక ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 ఆదివారం జ‌ర‌గ‌నుంది.




Next Story