రీ ఎంట్రీలో దుమ్మురేపిన ఖవాజా.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు
Usman Khawaja makes with back to back centuries.ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రీ ఎంట్రీలో అదరగొట్టాడు.
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2022 3:15 PM ISTఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రీ ఎంట్రీలో అదరగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసి ఖవాజా సత్తా చాటాడు. కరోనా మహమ్మారి కారణంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ట్రవిస్ హెడ్ జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో రెండేళ్ల తరువాత ఉస్మాన్ ఖవాజాకు ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కింది. ఈ క్రమంలో అందివచ్చిన అవకాశాన్ని ఖవాజా రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులతో రాణించిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన మూడవ ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డులెక్కాడు. ఖవాజా కంటే ముందు వాల్టర్స్, రికీ పాంటింగ్ ఈ ఫీట్‌ను సాధించారు. యాషెస్ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు.
All hail the King of the SCG: Usman Khawaja! 👑
— cricket.com.au (@cricketcomau) January 8, 2022
England will require a further 358 runs to win on day five #Ashes
ఖవాజా శతకంతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 265 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇక ఐదో రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఎలా ఆడతారు అన్నదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారం పడి ఉంది. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు కుప్పకూలింది. యాషెస్ సిరీస్ ఇప్పటికే ఆస్ట్రేలియా (3-0) వశమైన సంగతి తెలిసిందే. ఇక వైట్ వాష్‌నుంచి తప్పించుకోవాలంటే ఐదో రోజు మొత్తం ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేయక తప్పదు.