బంగ్లాదేశ్ కు షాకిచ్చిన అమెరికా
టీ-20 మ్యాచ్ లలో ఎప్పుడు ఏ జట్టు.. ఎవరికి షాకిస్తుందో అసలు ఊహించలేము. ఎందుకంటే గతంలో ఎన్నో పసికూన జట్లు పెద్ద పెద్ద జట్లను ఓడించాయి
By Medi Samrat Published on 22 May 2024 9:00 AM ISTటీ-20 మ్యాచ్ లలో ఎప్పుడు ఏ జట్టు.. ఎవరికి షాకిస్తుందో అసలు ఊహించలేము. ఎందుకంటే గతంలో ఎన్నో పసికూన జట్లు పెద్ద పెద్ద జట్లను ఓడించాయి. ఇక టీ20లలో బంగ్లాదేశ్ జట్టు ప్రదర్శన బాగానే ఉంటుంది. అయితే అలాంటి జట్టుకు పసికూన అయిన అమెరికా జట్టు షాకిచ్చింది. మే 21, మంగళవారం నాడు USA చరిత్ర సృష్టించింది. T20I క్రికెట్‌లో టెస్ట్ ఆడే దేశంపై వారి రెండవ విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో USA జట్టు 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసింది. మోనాక్ పటేల్ నేతృత్వంలోని USA జట్టు 2024 T20 ప్రపంచ కప్‌కు కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ జట్టుపై విజయం సాధించడం ఆ జట్టుకు మంచి బూస్టింగ్ ను ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ ను మొదటిసారిగా వెస్టిండీస్‌తో పాటు USA సహ-హోస్ట్ చేయనుంది.
హ్యూస్టన్‌లోని ప్రైరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులకు పరిమితం చేసింది అమెరికా. బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్లు లిట్టన్ దాస్ (14), సౌమ్య సర్కార్ (20), మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (6) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. తౌహిద్ హిర్దోయు (47 బంతుల్లో 58), మహ్ముద్దుల్లా (22 బంతుల్లో 31) రాణించడంతో ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరు చేసింది. USA T20 ప్రపంచ కప్ జట్టులో భాగమైన న్యూజిలాండ్ మాజీ ఆల్-రౌండర్ కోరీ ఆండర్సన్ 25 బంతుల్లో 34 పరుగులు చేయగా, హర్మీత్ సింగ్ కేవలం 13 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హర్మీత్ 3 సిక్సర్లు, 2 బౌండరీలతో అదరగొట్టాడంతో బంగ్లాదేశ్ కు విజయం దూరమైంది. హర్మీత్ సింగ్ U19 స్థాయిలో భారతదేశం తరపున ఆడాడు.. USAకి వెళ్లడానికి ముందు దేశీయ క్రికెట్‌లో ముంబై, IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.