పంజాబ్ కింగ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో గొడవలు.. చివరికి కోర్టుకు

బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా, జట్టు సహ యజమాని, వ్యాపారవేత్త మోహిత్ బర్మన్ తన షేర్లలో కొంత భాగాన్ని మూడవ పక్షానికి విక్రయించకుండా నిరోధించాలని చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు.

By Medi Samrat  Published on  17 Aug 2024 4:15 PM IST
పంజాబ్ కింగ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో గొడవలు.. చివరికి కోర్టుకు

బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ సహ-యజమాని ప్రీతి జింటా, జట్టు సహ యజమాని, వ్యాపారవేత్త మోహిత్ బర్మన్ తన షేర్లలో కొంత భాగాన్ని మూడవ పక్షానికి విక్రయించకుండా నిరోధించాలని చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు. నివేదికల ప్రకారం, కంపెనీ ఒప్పందం ప్రకారం బర్మన్ తన ప్రీ-ఎంప్షన్ హక్కులను ఉల్లంఘించారని పేర్కొంటూ, కంపెనీలో తన 11.5% వాటాను అమ్మివేయకుండా ఆపాలని జింటా కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు బర్మన్‌తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేసును ఆగస్టు 20, 2024న విచారణకు జాబితా చేసింది.

IPL మొదలైనప్పటి నుండి అసలైన ఎనిమిది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 17 ఏళ్ల ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒకసారి ఫైనల్‌కు, ఒకసారి సెమీఫైనల్‌కు చేరిన ఈ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. పంజాబ్ కింగ్స్ లో అత్యధికంగా 48 శాతంతో బర్మన్ వాటాను కలిగి ఉన్నారు. ప్రీతీ జింటాకు 23 శాతం, నెస్‌ వాడియాకు 23 శాతం, మిగతా వాటా కరన్‌ పాల్‌ అనే వ్యాపార‌వేత్త‌కు ఉంది. అత్య‌ధిక వాటా క‌లిగిన బ‌ర్మ‌న్‌ తన షేర్లను ఇతర భాగస్వాములకు తెలియకుండా అమ్మేందుకు సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న వాటాలోని 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు బర్మన్ ప్రయత్నిస్తున్నట్లు ప్ర‌చారం సాగుతోంది. బ‌ర్మ‌న్ షేర్ల‌ను విక్ర‌యించకుండా అడ్డుకోవాల‌ని ప్రీతీ జింటా చండీగఢ్‌ హైకోర్టును ఆశ్రయించారు.

అంత‌ర్గ‌త ఒప్పందాల ప్ర‌కారం ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే తొలుత ఇతర యజమానులకు సమాచారం అందాలి. అయితే బ‌ర్మ‌న్ ఈ ఒప్పందాన్ని ఇప్పుడు ఉల్లంఘించడంతో ప్రీతా జింటా కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఈ వార్తలను మోహిత్ బర్మన్‌ మాత్రం కొట్టిపారేశారు.. తన షేర్లను విక్రయించే ఆలోచన లేదని అంటున్నారు. 2022లో ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను చేర్చినప్పటి నుంచి ఫ్రాంచైజీల విలువ గణనీయంగా పెరిగింది. ఓ ఫ్రాంచైజీ $ 650-700 మిలియన్ డాలర్ల వరకు విలువను కలిగి ఉంటుంది.. ఇది INR 5,300 కోట్ల నుండి INR 5,800 కోట్ల మధ్య ఉండవచ్చు. ఆ వాల్యుయేషన్‌లో 11.5 శాతం సుమారుగా 540-600 కోట్ల రూపాయలు ఉంటుంది. అయితే బర్మన్ 700 కోట్ల కంటే ఎక్కువగా కోట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Next Story