సౌరవ్ గంగూలీకి సరికొత్త బాధ్యతలు

Tripura names Sourav Ganguly new state tourism ambassador. భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీకి సరికొత్త బాధ్యతలు వచ్చాయి.

By Medi Samrat
Published on : 24 May 2023 11:15 AM IST

సౌరవ్ గంగూలీకి సరికొత్త బాధ్యతలు

భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీకి సరికొత్త బాధ్యతలు వచ్చాయి. ఆయన బీజేపీ పాలిత త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నాడు. భారత మాజీ కెప్టెన్ త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరితో మంగళవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా పంచుకున్నారు. ఈ బాధ్యతలు తీసుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని గంగూలీ చెప్పాడు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. "భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే మా ప్రతిపాదనను అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఆయనతో టెలిఫోనిక్ సంభాషించాను. నేను గంగూలీ జీ భాగస్వామ్యం ఖచ్చితంగా రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని విశ్వసిస్తున్నాను." అంటూ ట్వీట్ చేశారు త్రిపుర ముఖ్యమంత్రి.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు త్రిపుర టూరిజం మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలిసి గంగూలీని కలిశారు. గంగూలీ లాంటి ప్రముఖ వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల త్రిపురలో పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందని చౌదరి అభిప్రాయపడ్డారు. "త్రిపుర రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి తీసుకెళ్లడానికి చాలా ప్రమోషన్, సరైన బ్రాండింగ్ అవసరం. అందుకు మాకు ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్ కావాలి! త్రిపుర పర్యాటకాన్ని ప్రపంచానికి ప్రచారం చేయడానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మన ప్రియమైన దాదా సౌరవ్ గంగూలీ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారు చెప్పండి" అంటూ సుశాంత చౌదరి మీడియాతో చెప్పుకొచ్చారు.


Next Story