'ఇమ్రాన్‌కు జైలులో సరైన చికిత్స అందించండి'.. పాక్‌ ప్రధానికి దిగ్గ‌జాల లేఖ‌..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది మాజీ కెప్టెన్లు, దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా పాక్ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచారు.

By -  Medi Samrat
Published on : 17 Feb 2026 4:08 PM IST

ఇమ్రాన్‌కు జైలులో సరైన చికిత్స అందించండి.. పాక్‌ ప్రధానికి దిగ్గ‌జాల లేఖ‌..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 మంది మాజీ కెప్టెన్లు, దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అలన్ బోర్డర్, స్టీవ్ వా పాక్ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచారు. జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడం, కంటి చూపు మందగించడం వంటి వార్తలతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

దీంతో ఫిబ్రవరి 17, 2026న క్రికెట్ దిగ్గజాలు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌కు ఒక లేఖ రాశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు.. తన‌కు నచ్చిన వైద్యులచే తక్షణ చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఆయ‌న‌ కుటుంబంతో క్రమం తప్పకుండా కలిసే హక్కును.. ఎటువంటి ఆలస్యం లేకుండా న్యాయమైన, పారదర్శకమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా అందించాల‌ని కోరారు.

హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 14 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున‌ జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్‌కు సరైన వైద్య చికిత్స అందించాలని ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు.

భారత్‌ నుండి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియా నుండి గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, అలన్ బోర్డర్, స్టీవ్ వా, కిమ్ హ్యూస్, బెలిండా క్లార్క్, ఇంగ్లాండ్‌కు చెందిన మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్, మైఖేల్ బ్రెయర్లీ, డేవిడ్ గోవర్‌తోపాటు క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), జాన్ రైట్ (న్యూజిలాండ్) లతో కలిసి ఈ లేఖపై సంతకం చేశారు.

నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఎవరూ ఈ లేఖపై సంతకం చేయలేదు. అయితే, గత వారం వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది సహా పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో ఇమ్రాన్‌కు సరైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల.. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితికి సంబంధించి కొన్ని తీవ్రమైన నివేదికలు వెలువడ్డాయి, దీనిలో ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు 85% తగ్గిందని వెల్లడైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించిన దర్యాప్తులో ఇది వెల్లడైంది. అతని కుమారుడు సులేమాన్, డిసెంబర్ 2025లో తన తండ్రిని "డెత్ సెల్" అని పిలువబడే చాలా చిన్న సెల్‌లో ఉంచారని నివేదించాడు.

నివేదికల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 2023 నుండి అడియాలా జైలులో ఒంటరిగా ఉంచారు. సమావేశం తర్వాత ఆయన న్యాయవాది మాట్లాడుతూ.. ఆయన చాలా కలత చెంది, మానసికంగా ఒత్తిడికి గురైనట్లు కనిపించారని తెలిపారు. 73 ఏళ్ల ఇమ్రాన్ కూడా తన వ్యక్తిగత వైద్యుల నుండి చికిత్స పొందేందుకు అనుమతి లేదని అన్నారు. తనకు రోజువారీ రక్త పరీక్షలు నిరాకరించబడ్డాయని అన్నారు. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ, రెండేళ్లుగా తనను దంతవైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లలేదని అన్నారు. త‌న‌ కుటుంబం, న్యాయవాదుల సందర్శనలపై ఆంక్షలు విధించబడ్డాయని పేర్కొన్నాడు.

Next Story