తీవ్ర విషాదం.. క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
By - అంజి |
తీవ్ర విషాదం.. క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా నాలుగో దశ (Stage 4) క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొద్ది రోజులుగా ఖాన్‌చంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. తండ్రి ఆరోగ్యం బాగోలేదన్న వార్త తెలియగానే, చెన్నైలో జింబాబ్వేతో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌కు ముందు రింకూ సింగ్ క్యాంప్ నుండి బయటకు వెళ్లారు.
అయితే, దేశం పట్ల తన బాధ్యతను గుర్తిస్తూ తిరిగి జట్టులోకి చేరినప్పటికీ, తుది జట్టులో (Playing XI) అతనికి అవకాశం దక్కలేదు. రింకూ సింగ్ ఈ స్థాయికి చేరుకోవడంలో ఆయన తండ్రి పాత్ర మరువలేనిది. అలీగఢ్‌లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సాధారణ కార్మికుడిగా ఉంటూనే, ఎన్నో ఆర్థిక కష్టాలను ఓర్చి రింకూను గొప్ప క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. కొడుకు స్టార్ క్రికెటర్ అయినప్పటికీ, ఆయన తన వృత్తి పట్ల ఉన్న మక్కువతో కొన్నాళ్ల పాటు సిలిండర్ డెలివరీ కొనసాగించి వార్తల్లో నిలిచారు.
హర్భజన్ సింగ్ సంతాపం:
మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ధృవీకరిస్తూ సంతాపం తెలిపారు. "రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ మరణవార్త నన్ను కలిచివేసింది. వరల్డ్ కప్ బాధ్యతల్లో ఉంటూనే ఇటువంటి కష్ట సమయాన్ని ఎదుర్కోవడం రింకూకు చాలా కష్టం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని ప్రార్థించారు.