అంధ అథ్లెట్‌కు ప్ర‌పోజ్ చేసిన గైడ్‌.. వీడియో వైర‌ల్‌

Track Guide proposed Sprinter Keula Nidreia Pereira.టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్ర‌వారం ఓ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sept 2021 12:44 PM IST
అంధ అథ్లెట్‌కు ప్ర‌పోజ్ చేసిన గైడ్‌.. వీడియో వైర‌ల్‌

టోక్యో వేదిక‌గా జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో శుక్ర‌వారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఆమెకు మెడ‌ల్ ద‌క్క‌లేదు కానీ.. ఎంగేజ్‌మెంట్ రింగ్ ద‌క్కింది. పారాలింపిక్స్‌లో అంద‌రికి గెలుపోట‌ముల అనుభ‌వాన్ని ఇస్తే ఆమెకు మాత్రం జీవిత భాగ‌స్వామినిచ్చింది. ఓ అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్‌ రన్నింగ్‌ ట్రాక్‌పైనే ప్రమోజ్‌ చేసి ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు.

వివ‌రాల్లోకి వెళితే.. కేప్ వ‌ర్డే దేశానికి చెందిన స్ప్రింట‌ర్ కౌలా నిద్రేయి పెరీరా సిమెడో 200 మీట‌ర్స్ ఈవెంట్ హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె సెమీఫైన‌ల్‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. పారాలింపిక్స్‌లో అంధ‌ అథ్లెట్లు ప‌రుగు తీస్తుంటే.. వారికి తోడుగా గైడ్‌లు ఉంటారు. ఆ ఇద్ద‌రి చేతుల్ని క‌ట్టేసి ప‌రుగెత్తిస్తారు. నాలుగో స్థానంలో నిల‌వ‌డంతో ఆమె ఒకింత బాధ ప‌డుతుండ‌గా.. ట్రాక్‌పైనే గైడ్ మాన్యువ‌ల్ ఆంటోనియో వాజ్ ద ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారి ఆశ్చ‌ర్యానికి లోనైన పెరీరా.. అనంత‌రం తేరుకుని ఒకే చెప్పేసింది. ప‌క్క‌నే ఉన్న స‌హ‌చ‌ర అథ్లెట్ల‌తో స‌హ మైదానంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ చ‌ప్ప‌ట్ల‌తో ఈ ప్రేమ‌జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.

ఫినిష్ లైన్ ప్ర‌పోజ‌ల్‌పై పారాలింపిక్స్ ట్విట్ట‌ర్‌లో ఓ జిఫ్ పోస్టు చేశారు. జీవితాంతం ఇద్ద‌రూ క‌లిసి ప‌రుగెత్తుతార‌ని ఆశిస్తున్న‌ట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story