ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆట‌గాళ్లలో ఒక్క‌ భారతీయ బ్యాట్స్‌మెన్ అయినా ఉన్నాడా.?

ఐసీసీ టోర్నీ వచ్చినప్పుడల్లా క్రికెట్ ప్రపంచం మొత్తం దానిపైనే దృష్టి సారిస్తుంది.

By Medi Samrat  Published on  15 Feb 2025 9:08 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆట‌గాళ్లలో ఒక్క‌ భారతీయ బ్యాట్స్‌మెన్ అయినా ఉన్నాడా.?

ఐసీసీ టోర్నీ వచ్చినప్పుడల్లా క్రికెట్ ప్రపంచం మొత్తం దానిపైనే దృష్టి సారిస్తుంది. ఐసీసీ టోర్నీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ జట్లు ఆడడమే ఇందుకు కారణం. ఈ టోర్నీలోనే ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లు ఒకరినొకరు ముఖాముఖి ఎదుర్కొంటారు. ఈ టోర్నీల్లో కనిపించే పోటీ వేరు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ పాకిస్థాన్‌, దుబాయ్‌లోని పిచ్‌లపై జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనుండగా, మిగిలిన మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరుగుతాయి. రెండు చోట్లా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఈ ఎడిషన్‌కు ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్ప‌టివ‌ర‌కూ ఎవరు ఎక్కువ పరుగులు చేశారో.. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డును ఏ భారతీయ బ్యాట్స్‌మెన్‌ కలిగి ఉన్నాడో తెలుసుకుందాం.

క్రిస్ గేల్

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్. గేల్ ఇప్పుడు రిటైరయ్యాడు, అయితే అతను ఆడుతున్నప్పుడు మాత్రం ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2002 నుండి 2013 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో 17 మ్యాచ్‌లు ఆడాడు. 2004లో వెస్టిండీస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ సమయంలో గేల్ 52.73 సగటుతో 791 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ వచ్చాయి.

మహేల జయవర్ధనే

ఈ జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరు రెండో స్థానంలో ఉంది. అతడు 2000 నుండి 2013 వరకు మొత్తం 22 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. ఈ అనుభవజ్ఞుడైన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ మాత్రం సెంచరీ చేయలేకపోయాడు. అయితే అతడు 41.22 సగటుతో ఐదు అర్ధ సెంచరీల సాయంతో 742 పరుగులు చేశాడు.

శిఖర్ ధావన్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్-5 బ్యాట్స్‌మెన్‌లను పరిశీలిస్తే.. శిఖర్ ధావన్ కేవ‌లం 10 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. అతను 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీల‌లో మాత్రమే పాల్గొన్నాడు. ఈ రెండు ఎడిషన్లలోనూ ధావన్ బలంగా బ్యాటింగ్ చేశాడు. 10 మ్యాచ్‌లలో 77.88 సగటుతో 701 పరుగులు చేశాడు, ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భార‌త్ త‌రుపున‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ధావన్ అవ‌డం విశేషం.

కుమార సంగక్కర

ఈ విషయంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పేరు నాలుగో స్థానంలో ఉంది. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2000, 2013 మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 22 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతడు 37.94 సగటుతో 683 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలు వచ్చాయి.

సౌరవ్ గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 1998 నుంచి 2004 వరకు 13 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. గంగూలీ 73.88 సగటుతో 665 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో భారత్ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఇద్దరు ఉన్నారు. మరో విషయం ఏమిటంటే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లో నలుగురు ఎడ‌మ‌చేతి వాటం గలవారే. గేల్, ధావన్, సంగక్కర్, గంగూలీ అందరూ ఎడ‌మ‌చేతి వాటం బ్యాట్స్‌మెన్ కాగా, జయవర్ధనే మాత్రమే టాప్-5లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్.

Next Story