టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు. చివరి రోజు కూడా పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో కృష్ణ నాగర్ చరిత్ర సృష్టించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగం ఎస్‌హెచ్ 6లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో హాంకాంగ్ క్రీడాకారుడు కైమన్ చూపై 21-17, 16-21, 21-17 విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించాడు.
ఈ రోజు ఉదయం బ్యాడ్మింటన్ ఎస్ఎల్-4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణ నాగర్ సాధించిన స్వర్ణంతో టోక్యా పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 19కి చేరింది. వీటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 24వ స్థానంలో ఉంది. కాగా.. నేటితో టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ ముగియనున్నాయి.