సిరీస్‌పై భారత్ గురి.. పరువు దక్కించుకోవాలని లంక
Today India vs Sri lanka 2nd ODI.ధావన్ నేతృత్వంలో కుర్రాళ్లు సత్తా చాటారు. లంకతో తొలి వన్డేల్లో అన్ని
By తోట వంశీ కుమార్ Published on 20 July 2021 5:56 AM GMTధావన్ నేతృత్వంలో కుర్రాళ్లు సత్తా చాటారు. లంకతో తొలి వన్డేల్లో అన్ని విభాగాల్లో సమిష్టిగా సత్తా చాటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఊపులో నేడు(మంగళవారం) జరిగే రెండో వన్డేలో విజయం సాధించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఇదిలా ఉంటే.. లంక పరిస్థితి మరోరకంగా ఉంది. గెలవడం మాట అటుంచి కనీసం ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల నేడు జరిగే రెండో వన్డేలో కూడా మరోసారి భారత్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
రెగ్యులర్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండటంతో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లలో యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు భారత్‌కు చక్కటి అవకాశం దక్కింది. తొలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ చివరి వరకు క్రీజులో నిలబడగా.. పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో లక్ష్యాన్ని భారత్ 37వ ఓవర్లోనే ఛేదించింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తొలి వన్డేలో మనీష్ పాండే తప్పించి మిగతా అందరూ ఆకట్టుకున్నారు. అతడు మాత్రం 40 బంతుల్లో 26 పరుగులే చేశాడు. అయితే.. జట్టు మేనేజ్‌మెంట్ అతడిపై భరోసా ఉంచింది. దీంతో అతడికి మరోసారి అవకాశం దక్కనుంది. మనీష్ పాండే కూడా రాణిస్తే లంకకు కష్టాలు మరింత పెరగనున్నాయి.
బౌలింగ్‌లో భారత్ పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి కేవలం ఒక్క వికెటే పడగొట్టినా.. ప్రత్యర్థి ఆటగాళ్లు అతని బౌలింగ్‌లో పరుగులు సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, దీపక్ చహర్ తమ వంతు పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అనుభవజ్ఞుడు భువనేశ్వర్ మాత్రం తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాడు. రెండో వన్డేలో అయినా అతడు లయను అందుకోవాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎటువంటి మార్పులు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది.
లంక పరిస్థితి పూర్తి భిన్నం..
లంక జట్టులోని చాలా మంది బ్యాట్స్‌మెన్ మంచి శుభారంభాలు చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విపలం అయ్యారు. కరుణరత్నె, దాసున్ షనక, అసలంక, అవిష్క ఫెర్నాండో మరింత దూకుడుగా ఆడితే.. ఆజట్టు ఇంకా మెరుగైన స్కోరు సాధిస్తుందనడంలో సందేహాం లేదు. ఇక లంక బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ధనంజయ రెండు వికెట్లు తీసినా.. ఐదు ఓవర్లకే 50 పరుగులు ఇచ్చాడు. చమీరా, హసరంగా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు. లంక బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లను అడ్డుకునేంటే విజయం పై ఆశలు పెట్టుకోవచ్చు. లేకుండా సిరీస్ కోల్పోవడం ఖాయం.