ఆసీస్ క్రికెట్‌లో కలకలం.. మహిళతో అసభ్య సందేశాలు.. టెస్టు కెప్టెన్సీకి టిమ్‌పైన్ రాజీనామా
Tim Paine Quits As Australia Test Captain.సెక్స్ చాటింగ్ కుంభకోణంలో చిక్కుకున్న 36 ఏళ్ల టిమ్ పైన్ ఆస్ట్రేలియా
By తోట వంశీ కుమార్ Published on 19 Nov 2021 11:09 AM ISTసెక్స్ చాటింగ్ కుంభకోణంలో చిక్కుకున్న 36 ఏళ్ల టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు శుక్రవారం హోబర్ట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాను కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తన సహోద్యోగి అయిన ఓ మహిళకు పైన్ 2017లో పలు అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వీటిపై ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విచారణ చేపట్టింది. ఈ విచారణలో పైన్ తన ఫోటోతో సహా పలు మెసేజ్‌లు పంపాడని తేలింది. దీంతో తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఫైన్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.
'ఆస్ట్రేలియన్ పురుషుల టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని ఈరోజు నేను నా నిర్ణయాన్ని ప్రకటించాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ నాకు, నా కుటుంబానికి మరియు క్రికెట్‌కు సరైన నిర్ణయం' అని పైన్ తెలిపాడు. నాలుగేళ్ల క్రితం అప్పటి సహోద్యోగితో సందేశాలను పరస్పరం పంచుకున్నట్లు తెలిపాడు. తాజా నిర్ణయం అందులో భాగమేనని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణలో తాను బహిరంగంగానే పాల్గొన్నట్టు వెల్లడించాడు.
కాగా.. ఈ ప్రైవేట్ టెక్స్ట్ ఎక్స్‌చేంజ్ పబ్లిక్‌గా మారబోతోందని ఇటీవల తెలుసుకున్నట్టు చెప్పాడు. అప్పట్లో తన భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడానని.. వారి క్షమాపణ, మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించాడు. ఈ ఘటన తమను వేధించినప్పటికీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా చేసినట్టుగానే ఇకపైనా జట్టుపై పూర్తిగా దృష్టి పెడతానన్నాడు. ఈ ఘటన తమ ఆట ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు క్షమించాలని కోరాడు.
"నేను కెప్టెన్‌గా వైదొలగడం సరైన నిర్ణయమని నేను నమ్ముతున్నాను, తక్షణమే అమలులోకి వస్తుంది. యాషెస్ సిరీస్ కంటే ముందు జట్టుకు అవాంఛనీయమైన అంతరాయం కలిగించాలని నేను కోరుకోవడం లేదు. ఆస్ట్రేలియన్ పురుషుల టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించడం నా క్రీడా జీవితంలో గొప్ప అదృష్టమని ఫైన్ తెలిపాడు. సహచరుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేదానికి గురైన విపత్కర పరిస్థితుల్లో ఆసీస్ టెస్టు 46వ కెప్టెన్‌గా టిమ్ పైన్ 2018లో బాధ్యతలు చేపట్టాడు.