Video : ఇదెక్క‌డి విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఆపై సెంచరీ.. మ్యాచ్‌ను డిసైడ్ చేసిన హిట్ట‌ర్‌..!

వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది.

By Medi Samrat
Published on : 26 July 2025 8:45 AM IST

Video : ఇదెక్క‌డి విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఆపై సెంచరీ.. మ్యాచ్‌ను డిసైడ్ చేసిన హిట్ట‌ర్‌..!

వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు టీ20 సిరీస్‌లో తన సత్తా చాటుతోంది. మొదటి 2 T20Iలను గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. సెయింట్ కిట్స్‌లో జ‌రిగిన‌ మూడవ T20Iలో కూడా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది. ఈ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ బ్యాట్‌తో ప్రకంపనలు సృష్టించాడు. టిమ్ డేవిడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫోర్లు, సిక్స‌ర్ల‌తో వరుస రికార్డులు సృష్టించాడు. కేవ‌లం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మార్కస్ స్టోయినిస్, ట్రెవిడ్ హెడ్ రికార్డులను డేవిడ్ బద్దలు కొట్టాడు. త‌ద్వారా ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు మార్కస్ స్టోయినిస్, ట్రావిస్ హెడ్ పేరిట ఉంది. వీరిద్దరూ 17-17 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు.

అనంత‌రం డేవిడ్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 11 సిక్స్‌లు, 6 ఫోర్ల సహాయంతో టీ20ల‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాదు.. భారత ఆటగాడు అభిషేక్ శర్మ రికార్డును కూడా సమం చేశాడు. టిమ్ డేవిడ్ సెంచరీ టెస్ట్ ఆడే స‌భ్య దేశాల‌పై న‌మోదైన‌ మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ.

T20Iల‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌లు వీరే..

డేవిడ్ మిల్లర్ - 35

రోహిత్ శర్మ - 35

అభిషేక్ శర్మ - 37

టిమ్ డేవిడ్ - 37

జాన్సన్ చార్లెస్ - 39

టీ20 సిరీస్‌ ఆస్ట్రేలియా కైవసం

టిమ్ డేవిడ్ తుఫాను సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని అందించింది. 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 3-0 ఆధిక్యం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 16.1 ఓవర్లలోనే సాధించింది. టిమ్ డేవిడ్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ ఓవెన్ కూడా 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.టిమ్ డేవిడ్‌, ఓవెన్ మధ్య నాలుగో వికెట్‌కు 128 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 61 పరుగుల వద్ద ఉండగా.. టిమ్ డేవిడ్ వచ్చి సంచలన ఇన్నింగ్స్ ఆడి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

Next Story