Movie Review : టిల్లు స్క్వేర్ రివ్యూ
డీజే టిల్లు.. యూత్ కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ నటనకు అంతా ఫిదా అయిపోయారు.
By Medi Samrat Published on 29 March 2024 3:18 PM GMTడీజే టిల్లు.. యూత్ కు చాలా బాగా కనెక్ట్ అయిన సినిమా. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో ఉన్న డైలాగ్స్ అందరికీ బాగా గుర్తుంటాయి. రాధిక.. టిల్లును ముప్పతిప్పలు పెట్టడం అందరికీ బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఓటీటీ కారణంగా సినిమా చాలా మందికి చేరింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మామూలు విషయమా.. అంచనాలు భారీగానే ఉంటాయి. మొదటి పాత్రలో రాధిక పాత్రలో అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో ఆ అంచనాలను టిల్లు స్క్వేర్ అందుకుందా లేదా అన్నది ఇక్కడ తెలుసుకుందాం.
కథ :
బాలగంగాధర్ తిలక్ అకా టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) ఈవెంట్ ప్లానర్ అలాగే DJ కూడా!! గత ఏడాది తన పుట్టినరోజు నాడు రాధికా కారణంగా ఎలా చిక్కుల్లో పడ్డాడో అందరికీ తెలిసిందే. అందుకే కొంచెం డెలికేట్ హార్ట్ తోని సైలెంట్ గా ఉంటాడు. ఒక పార్టీలో టిల్లును లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) కలుస్తుంది. ఆమెకు టిల్లు హార్ట్ ఇచ్చేసి రొమాన్స్ కానిచ్చేస్తాడు. అయితే మరిన్ని ఇబ్బందుల్లోకి టిల్లు వెళ్ళిపోతాడు. లిల్లీ ఎవరు? ఆమె ఏదో విషయం మీద టిల్లు వెంట పడుతుంది. ఇంతకూ టిల్లు ఏమి చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో దొరుకుతాయి.
ప్లస్ పాయింట్లు:
DJ టిల్లు లాగే టిల్లు స్క్వేర్ కూడా సాగినా.. కథానాయకుడి క్యారెక్టరైజేషన్ తో నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. కథలో లాజిక్ లు చూడకుండా చాలా బాగా ఎంజాయ్ చేసేలా సీన్స్, డైలాగ్స్ ను చూపించారు. డీజే టిల్లు మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ప్రేక్షకులు టిల్లు క్యారెక్టర్ ను చూసి కావాల్సినంత వినోదాన్ని పొందుతారు. ఓపెనింగ్ సీక్వెన్స్ నుండి, సిద్ధూ తన వన్-లైనర్స్, బాడీ లాంగ్వేజ్ , ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కడుపుబ్బా నవ్విస్తాడు. సిద్ధు స్వయంగా రచయిత కాబట్టి, ప్రేక్షకులు తన నుండి ఏమి ఆశిస్తున్నారో అతనికి బాగా తెలుసు.. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో సెకండాఫ్ సాలిడ్ గా ఉంటుంది. వన్-లైనర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వైరల్ అయిన డైలాగ్స్ థియేటర్లలో ఆడియన్స్ చెబుతూ ఉండడం కూడా విశేషం. అనుపమ పరమేశ్వరన్ తన బోల్డ్ పాత్రలో చాలా బాగుంది. ఆమె మంచి కెమిస్ట్రీని పంచుకుంది. మురళీధర్ గౌడ్, ప్రిన్స్ ఇతర సహాయక నటీనటులు తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. వీరంతా కలిసి టిల్లుతో కావాల్సిన వినోదాన్ని అందించారు. ఇక సాంగ్స్ కూడా క్యాచీగా ఉండడంతో సినిమా మరింత ప్లస్ గా మారింది. కొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో బాగా వర్కౌట్ అయ్యాయి.
మైనస్ పాయింట్స్:
మొదటి భాగం ముగిసిన చోటనే సీక్వెల్ ప్రారంభమవుతుంది. లవ్ ట్రాక్ మొదలయ్యాక కాస్త స్లో అవుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్‌లో కథనం కాస్త ల్యాగ్ అయింది. బలమైన కథను ఆశించే వారికి కాస్త నిరాశ తప్పదు. కథ చాలా వరకూ మొదటి భాగాన్ని గుర్తుకు చేస్తాయి. కొన్ని అంశాలను డీల్ చేసిన విధానం సిల్లీగా కనిపిస్తోంది. ఆఖరి ట్విస్ట్ ముందే చూసినట్లుగా అనిపిస్తుంది.
ఫైనల్ గా:
దర్శకుడు మల్లిక్ రామ్ 'టిల్లు స్క్వేర్' ను 'డీజే టిల్లు' ఎక్కడ ముగిసిందో అక్కడి నుండి మొదలు పెట్టాడు. 'డీజే టిల్లు'లో సిద్ధు, నేహాశెట్టిల పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిస్తే, ఈసారి సినిమాను తమ భుజాలపై మోసారు సిద్ధూ, అనుపమ. సిద్ధూ తన వన్-లైనర్‌లతో చాలా వరకూ నవ్వించేస్తాడు. లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ సినిమాకు గ్లామర్ జోడించింది. బలమైన విలన్ లేడనేది ప్రధాన సమస్య. మురళీ శర్మ విలన్‌గా కనిపిస్తాడు. అయితే, అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ.
'టిల్లు స్క్వేర్' సాంకేతికంగా కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఫ్రేమ్‌లు, సినిమా నిర్మాణ విలువ సినిమాను పెంచింది.
మొత్తానికి సిద్ధు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' మంచి వినోదాత్మక చిత్రం. ఈ చిత్రానికి కామెడీ, సిద్ధూ నటన ప్రధాన బలం. నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయొచ్చు.
రేటింగ్: 3.25/5