ఆ ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ టీమిండియా ఎంట్రీ పక్కా అంటున్నారు..!
Three Uncapped Players Perform well in IPL-2023. ఐపీఎల్ 2023 సీజన్ చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రేక్షకులు ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను చూస్తున్నారు.
By Medi Samrat Published on 24 April 2023 8:46 PM ISTఐపీఎల్ 2023 సీజన్ చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రేక్షకులు ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను చూస్తున్నారు. ఐపీఎల్-2023 సీజన్ దాదాపు సగం పూర్తైంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో ముగ్గురు అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరు తమ ఆటతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ ఆటగాళ్లు టీమ్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వవచ్చని ఊహాగానాలు వినపడుతున్నాయి.
1. తిలక్ వర్మ
ఐపీఎల్ 2023లో తిలక్ వర్మ అద్భుతాలు చేశాడు. ముంబై ఇండియన్స్ తరుపున అద్భుతంగా రాణిస్తున్నాడు. తిలక్ మిడిలార్డర్‌లో ముంబై ఇండియన్స్‌ను బలోపేతం చేశాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన తిలక్ ఇప్పటివరకు 217 పరుగులు చేశాడు. అంతకుముందు ఐపీఎల్-2022 సీజన్‌లో కూడా 14 మ్యాచ్‌లలో 397 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అతనిని ప్రశంసించాడు. ముంబై జట్టు తిలక్ వర్మను రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో తిలక్ త్వరలో టీమ్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వగలడని అందరూ భావిస్తున్నారు.
2. సుయాష్ శర్మ
20 ఏళ్ల యువ స్పిన్నర్ సుయాష్ శర్మ. 2023 సంవత్సరంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తొలి సీజన్‌లోనే తన ఆటతో అందరినీ ఆకట్టుకోగలిగాడు. అతని బౌలింగ్ లో స్టార్ బ్యాట్స్‌మెన్ సైతం నిలవలేకపోయారు. కేకేఆర్ జట్టు తరఫున 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు సైతం అతని బౌలింగ్‌లో చతికిలపడటం విశేషం. సుయాష్ శర్మ కూడా త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వనున్నాడని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
3. ఆకాష్ సింగ్
మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ముందుంటాడు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై తరుపున ఆకాశ్ సింగ్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆకాష్ సింగ్ వయస్సు 21 సంవత్సరాలు. ఇన్నింగ్స్ ప్రారంభంలో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్-2023లో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆకాశ్ సింగ్ టీమ్ ఇండియాలో ప్రవేశానికి పెద్ద సమయం పట్టకపోవచ్చనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.