నీరజ్ చోప్రా కొత్త కోచ్‌గా జావెలిన్ లెజెండ్..!
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా శనివారం ఒక పెద్ద ప్రకటన చేశాడు.
By Medi Samrat Published on 9 Nov 2024 5:22 PM ISTరెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా శనివారం ఒక పెద్ద ప్రకటన చేశాడు. తద్వారా తన కెరీర్‌లో ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. గ్రేట్ జావెలిన్ త్రోయర్ జాన్ జెలెజ్నీని తన కొత్త కోచ్‌గా ఎంచుకున్నట్లు నీరజ్ శనివారం ప్రకటించాడు. మూడుసార్లు ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ రికార్డ్ హోల్డర్ అయిన జెలెజ్నీ చోప్రాకు ఆరాధ్యదైవం.
కొత్త కోచ్‌ను ప్రకటించిన నీరజ్.. 'చిన్నప్పటి నుండి నేను ఆయన వీడియోలను చూస్తూ చాలా సమయం గడిపాను. ఆయన సాంకేతికత, ఖచ్చితత్వాన్ని ఎంతో ఇష్టపడ్డాను. ఆయన చాలా సంవత్సరాలుగా జావెలిన్ క్రీడలో అత్యుత్తమంగా ఉన్నారు. మన దగ్గర ఇలాంటి జావెలిన్ త్రోయింగ్ స్టైల్స్ ఉన్నందున.. ఆయనకు చాలా పరిజ్ఞానం ఉన్నందున కలిసి పనిచేయడం చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. నేను నా కెరీర్‌లో తదుపరి స్థాయికి వెళ్లాలనుకుంటున్న క్రమంలో జెలెజ్నీ నాతో ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. ఆయనతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా జెలెజ్నీ మాట్లాడుతూ.. 'నేను నీరజ్ గురించి చాలా ఏళ్ల క్రితం మాట్లాడాను.. అతడు గొప్ప ప్రతిభావంతుడు అని పిలిచాను. కెరీర్ మొదట్లో నీరజ్‌ను చూసినప్పుడు చాలా దూరం వెళతాడని అనిపించింది. నేను కోచింగ్ ప్రారంభించినట్లయితే.. నా మొదటి ఎంపిక నీరజ్ అని కూడా చెప్పాను. నేను అతని ప్రయాణాన్ని ఇష్టపడుతున్నాను.. నేను అతనిలో మంచి సామర్థ్యాన్ని చూస్తున్నాను.. ఎందుకంటే అతను యువకుడు.. మెరుగుపరుచుకోగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. కోచింగ్ కోసం చాలా మంది అథ్లెట్లు నన్ను సంప్రదించారు.. ఈ బాధ్యత తీసుకోవడం నాకు గొప్ప గౌరవం అని జెలెజ్నీ చెప్పారు. మేము ఒకరినొకరు లోతుగా తెలుసుకుంటున్నాం.. దక్షిణాఫ్రికాలోని శీతాకాల శిబిరంలో శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నాడు.
1992, 1996, 2000 ఒలింపిక్ క్రీడలలో స్వర్ణ పతక విజేత అయిన జెలెజ్నీ.. ఆల్ టైమ్‌లోని టాప్ టెన్ బెస్ట్ త్రోలలో ఐదు విసిరాడు. 1996లో జర్మనీలో 98.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు పర్యాయాలు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జెలెజ్నీ రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ మరియు మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ బార్బోరా స్పాటోకోవాకు శిక్షణ ఇచ్చాడు.