టీ20 సిరీస్ ఎవరిదో..?
Third T20 match between India and Sri lanka Today.మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి సమరానికి భారత్, శ్రీలంక జట్లు
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 1:38 PM ISTమూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరి సమరానికి భారత్, శ్రీలంక జట్లు సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం 1-1తో రెండు జట్లు సమంగా ఉన్నాయి. నేడు(శనివారం) రాజ్‌కోట్ వేదికగా జరిగే మూడో టి20లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు బావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి హోరా హోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్లు దాదాపుగా పొట్టి ఫార్మాట్కు దూరం అవుతున్న స్థితిలో కెత్త కెప్టెన్ హార్థిక్ పాండ్య సారథ్యంలోని యువ టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది. తొలి రెండు మ్యాచుల్లో కుర్రాళ్లు ఆకట్టుకోలేకపోయారు. ఈ సిరీస్‌లో అరంగ్రేటం చేసిన శుభ్‌మన్ గిల్ రెండు మ్యాచుల్లో దారుణంగా విఫలం అయ్యాడు. కనీసం రెండు అంకెల స్కోర్‌ను కూడా అందుకోలేకపోయాడు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా అతడు రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
ఒక మ్యాచ్‌లో ఓ మోస్తారుగా రాణించిన ఇషాన్ కిషన్ మరో మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. మరో అరంగ్రేట ఆటగాడు రాహుల్ త్రిపాఠి సైతం తనదైన ముద్ర వేయాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో విఫలం అయిన సూర్యకుమార్ యాదవ్ రెండో మ్యాచ్‌లో రాణించడం సానుకూల అంశం. హార్థిక్ పాండ్య నుంచి జట్టు మేనేజ్‌మెంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనను ఆశిస్తోంది. అక్షర్ పటేల్ ఒక్కడే అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇక చహల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ మాలి, ఉమ్రాన్ మాలిక్‌లు వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం టీమ్ఇండియాతో పోలిస్తే శ్రీలంక అన్ని విభాగాల్లో కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కాగా.. రెండో మ్యాచ్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా కెప్టెన్ దసున్ శానక అన్ని తానై జట్టుకు ముందుండి నడిపిస్తున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నాడు. శానకతో పాటు కుశాల్ మెండీస్, అసలంక మంచి ఫామ్‌లో ఉండడం లంకకు బాగా కలిసివచ్చే అంశం. వీరితో పాటు ఆల్‌రౌండర్లు హసరంగ, తీక్షణను బ్యాట్లు ఝుళిపిస్తే మరోమారు భారత్‌కు కష్టాలు తప్పవు. శ్రీలంక బౌలింగ్ విభాగం పట్టిష్టంగానే ఉంది. రజిత, మధుశంక, చమిక పేస్ త్రయంతో పాటు స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణలను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ఇక రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్ అనుకూలం. ఇక్కడ ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.