సిరీస్ ఎవరిదో..? విజయం కోసం ఇరు జట్ల తహతహ
చెన్నై వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడో వన్డే మ్యాచ్‌లో తలపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 22 March 2023 11:09 AM ISTభారత్, ఆస్ట్రేలియ ఆటగాళ్లు
తొలి వన్డేలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు రాహుల్, జడేజాలు రాణించడంతో గెలిచిన భారత్, రెండో వన్డేలో పూర్తిగా విఫలమైంది. బుధవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి మరో సిరీస్‌ను టీమ్ఇండియా సొంతం చేసుకుంటుందా..? లేక అన్ని విభాగాల్లో ఆధిక్యం ప్రదర్శించి ఆస్ట్రేలియా ట్రోఫీని ముద్దాడుతుందా..? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలమైన నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరం.
రోహిత్‌శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్లతో నిండిన భారత బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే ఏ జట్టు అయినా వణికిపోవాల్సిందే. అయితే.. వీరు ఆసీస్‌తో సిరీస్‌లో అంచనాలను అందుకోలేకపోయారు. తొలి వన్డేలో గిల్, కోహ్లీ, సూర్య కుమారులు చేసిన పరుగులు 24 కాగా.. విశాఖ మ్యాచ్‌లో రోహిత్‌తో సహా ఈ నలుగురు చేసిన పరుగులు 44 మాత్రమే. ఈ రెండు మ్యాచుల్లో సూర్యకుమార్ గోల్డెన్ డక్‌గా ఔట్ కావడం గమనార్హం.
చెన్నైలో టీమ్ఇండియా మ్యాచ్ గెలవాలంటే టాప్ ఆర్డర్ బ్యాటర్లు అయిన ఈ నలుగురు రాణించడం ఎంతో ముఖ్యం. కనీసం వీరిలో ముగ్గురు అయినా తమ స్థాయికి తగ్గట్లు చెలరేగితే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యకుమార్, గిల్‌లు తొలి రెండు వన్డేల్లో స్టార్క్ ఒకే తరహాలో ఔట్ చేశాడు. వీరిద్దరు ఆ పొరబాట్లు దిద్దుకోవాల్సి ఉంటుంది. ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్య కూడా ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయడం అవసరం.
కీలకమైన మూడో వన్డేలో ఆసీస్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. విధ్వంసర ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్ లు ఫిట్‌నెస్ సాధిస్తే తుది జట్టులోకి రావడం ఖాయం. వీరిద్దరు వస్తే ఆసీస్ బ్యాటింగ్ బలం మరింతగా పెరగనుంది. వార్నర్ జట్టులోకి వస్తే మిచెల్ మార్ష్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. చెన్నై పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆస్టన్ ఆగర్ ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.
పిచ్ ఎలా ఉంటుంది..?
సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్ అనుకూలం. స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించొచ్చు. అయితే.. వేడి వాతావరణం కారణంగా పేసర్లు స్వింగ్, సీమ్ రాబట్టే అవకాశం ఉంది. ఇక్కడ 21 వన్డే మ్యాచులు జరుగగా 13 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఈ మైదానంలో రెండు మ్యాచుల్లో తలపడగా చెరో మ్యాచులో విజయం సాధించాయి.