ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి 'అనవసరమైన' ఊహాగానాలు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఎందుకంటే రోహిత్ లాంటి గొప్ప ఆటగాళ్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి సమయం కావాలని అన్నారు.
తొమ్మిది నెలల్లో భారత్‌ను రెండవ ఐసీసీ టైటిల్ వైపు నడిపించిన తరువాత.. రోహిత్ అన్ని ఊహాగానాలను తోసిపుచ్చాడు.. తాను ODI ఫార్మాట్ నుండి రిటైర్ కావడం లేదని చెప్పాడు. 37 ఏళ్ల రోహిత్ 2027 ODI ప్రపంచ కప్ ఆడాలని ఇంకా కమిట్ కాలేదు.. అయితే అతని ఉనికి జట్టుకు మేలు చేస్తుందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు.
వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. నేను జ్యోతిష్యుడిని కాను.. 2027 ప్రపంచకప్ వరకు ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అతని ఫామ్, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో ఏమీ మాట్లాడటం సరికాదు కానీ అతను కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. రోహిత్ రిటైర్‌మెంట్‌పై జనాలు ఎందుకు ఊహాగానాలు చేశారో నాకు తెలియదు, అది అనవసరం. ఆ స్థాయి ఉన్న ఆటగాడికి తన భవిష్యత్తు గురించి నిర్ణయించుకునే హక్కు ఉండాలన్నారు.
ప్రస్తుతం రోహిత్ ఆడుతున్న తీరు అద్భుతంగా ఉందని వెంగ్‌సర్కార్ అన్నారు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వాటి గురించి ఇంకేం చెప్పగలను. విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు బిగ్ మ్యాచ్ ప్లేయర్లు, వేదిక ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప ప్రదర్శన చేస్తారు. జట్టు కోణం నుండి ఇది చాలా ముఖ్యం. వారి ఉనికి ప్రత్యర్థి జట్టును నిరుత్సాహపరుస్తుందన్నారు.
ఇదిలావుంటే.. రోహిత్ శర్మ ఇప్పటికీ బలమైన ఆటగాడేనని.. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించే ODI ప్రపంచకప్ వరకు అతను భారత జట్టుకు నాయకత్వం వహించగలడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.