సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ షాక్..!
Test specialists Pujara and Rahane likely face demotion in BCCI central contracts.టెస్టు స్పెషలిస్టులు, టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2022 3:33 PM ISTటెస్టు స్పెషలిస్టులు, టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు అయిన అజింక్యా రహానే, ఛతేశ్వర్ పుజారా ఇటీవల కాలంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో అయినా సత్తా చాటుతారని బావించిన సెలక్టర్లు అవకాశం కల్పించినా.. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేసి జట్టులో తమ స్థానాలకే ఎసరు తెచ్చుకున్నారు. దీంతో ఇంటా, బయట విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వారికి షాకివ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
వారి వార్షిక కాంట్రాక్టులకు సంబంధించిన గ్రేడ్‌లను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గ్రేడ్-ఏలో ఉన్న పుజారా, రహానెలను గ్రేడ్-బి తగ్గించనున్నారు. ఇప్పటికే 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్స్ కు సంబంధించిన ముసాయిదాను బీసీసీఐ సిద్దం చేసింది. దీనిని త్వరలో ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
'టీ 20 వరల్డ్ కప్ అయిపోగానే కాంట్రాక్ట్ ల ముసాయిదాను తయారు చేశాం. దానిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. కొత్త ఆటగాళ్ల ప్రదర్శనను దృష్టిలో పెట్టుకునే కాంట్రాక్టును తయారు చేశారు' అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
ఇక మూడు ఫార్మాట్లలో రాణిస్తున్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లకు బీసీసీఐ కాంట్రాక్టుల్లో ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గ్రేడ్-ఏ కాంట్రాక్టులో ఉన్న వీరికి గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా మాత్రమే గ్రేడ్-ఏ ప్లస్ కేటగిరిలో ఉన్నారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్ దక్కనుంది. ప్రస్తుతం సీ గ్రేడ్‌లో ఉన్న అతడిని గ్రేడ్ బి కి ప్రమోట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవల పేలవంగా ఆడుతున్న ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మలకు డిమోషన్ తప్పేలా లేదు.
కాగా.. ఏ ప్లస్ గ్రేడ్ లో ఉన్న ఆటగాళ్లకు రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ లోని వారికి రూ.5 కోట్లు, బీ గ్రేడ్ ప్లేయర్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ లో ఉన్న వారికి రూ.కోటి చొప్పున వార్షిక పారితోషికాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది.