ధోనీపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. ట్వీట్ వైరల్
Telangana Minister KTR praises MS Dhoni.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022లో గురువారం రాత్రి ముంబై ఇండియన్స్
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022లో గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో విజయానికి 17 పరుగులు అవసరమైన వేళ.. మహేంద్రుడు బ్యాట్‌లో మాయాజాలం చేశాడు. మునుపటి ధోని ని గుర్తుకు తెస్తూ.. వరుసగా 6, 4, 2, 4 బాది చెన్నైకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో తనపై వస్తున్న విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం చెప్పాడు మహేంద్రుడు.
ఇక ధోని ఆడిన ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ధోని ఆటగురించే అంతా చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ధోనిపై ప్రశంసల జల్లు కురిపించారు. 'వాస్తవానికి వయసు అనేది ఒక అంకె మాత్రమే. ధోనీ ఓ ఛాంపియన్.. అసాధారణ ఫినిషర్.. ఓ లెజెండ్' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Age indeed is just a number!!!
— KTR (@KTRTRS) April 21, 2022
What an outstanding finisher this champion is @msdhoni #MSDhoni the legend grows 👏👏
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (51 నాటౌట్; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. సూర్యకుమార్ యాదవ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), అరంగేట్ర ఆటగాడు హృతిక్ షోకీన్ (25) ఫర్వాలేదనిపించగా..రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), బ్రేవిస్ (4), పొలార్డ్(14) లు దారుణంగా విఫలం అయ్యారు.అనంతరం.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని( 28 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) తో పాటు అంబటి రాయుడు (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప (30; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో చెన్నై లక్ష్యాన్ని 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది.